హిందీ భాషా వివాదం ఓ రైతు ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కేంద్రప్రభుత్వం దేశంపై బలవంతంగా హిందీ భాషను రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మనస్తాపం చెందిన ఓ వృద్ధ రైతు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెట్టూరు సమీపంలోని తలయూరులో శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
85 ఏళ్ల తంగవేల్ అనే వృద్ధ రైతు శనివారం ఉదయం “మోదీ సర్కార్, కేంద్ర సర్కార్.. మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష. హిందీని రుద్దితే మా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి. హిందీ తొలగించాల్సిందే” అని తమిళంలో రాసి ఉన్న ఓ బ్యానర్ తో సేలం జిల్లాలోని డీఎంకే కార్యాలయానికి వచ్చాడు. 11 గంటల సమయంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడున్న వారు మంటల్ని ఆర్పేసినా.. తీవ్ర గాయాలతో అక్కడే మరణించాడు. మృతుడు మృతుడు డీఎంకే పార్టీ వ్యవసాయ సంఘం మాజీ నాయకుడని, ఇటీవల కాలం వరకు డీఎంకే క్రియాశీల సభ్యుడని తెలుస్తోంది.
ఈ ఘటనపై అధికార పార్టీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. తమ విద్యా సంస్థల్లో హిందీ బోధనను అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తామని సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన సంఘం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు.