Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుRabies : రేబిస్ అనుమానం.. కన్నకూతురిని చంపి తల్లి ఆత్మహత్య!

Rabies : రేబిస్ అనుమానం.. కన్నకూతురిని చంపి తల్లి ఆత్మహత్య!

Mental health and misinformation : ఒక చిన్న అనుమానం పెనుభూతమై, ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. తనకు రేబిస్ వ్యాధి సోకిందన్న భయం.. ఆ తల్లిని కర్కశంగా మార్చింది. కన్నపేగు బంధాన్ని తెంచుకుని, కుమార్తెను కడతేర్చింది. ఆపై తానూ ప్రాణాలు తీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అసలు ఆ తల్లి ఎందుకింతగా కుంగిపోయింది..? ఆ అనుమానానికి బీజం ఎక్కడ పడింది…?

- Advertisement -

అనారోగ్యం.. అనుమాన బీజం : యశోదకు భర్త నరేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంతకాలంగా సాధారణ అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే, తన అనారోగ్యానికి కారణం రేబిస్ వ్యాధేనని ఆమె బలంగా నమ్మడం మొదలుపెట్టింది. ఈ అనుమానమే ఆమెను తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి నెట్టింది. యూట్యూబ్‌లో రేబిస్ వ్యాధి లక్షణాల గురించి ఎక్కువగా వెతకడం, వాటిని తన అనారోగ్యానికి అన్వయించుకోవడం మొదలుపెట్టింది.

వైద్యం కన్నా మూఢనమ్మకాల వైపు మొగ్గు : భయంతో యశోద రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, ఆమె అనుమానం తీరలేదు. ఆధునిక వైద్యంపై నమ్మకం కోల్పోయింది. “వ్యాక్సిన్‌తో ఇది తగ్గదు, చెట్ల మందు (నాటు వైద్యం) వాడాలి, పత్యం చేయాలి” అని భర్తను పదేపదే వేధించింది. ఆమె మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న భర్త, ఆమెను సంతోషపెట్టేందుకు నాటు వైద్యం కూడా ప్రారంభించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు.

భర్త, తండ్రి చెప్పినా వినని వైనం : అది రేబిస్ కాదని, కేవలం అనారోగ్యమేనని భర్త నరేష్, యశోద తండ్రి ఎంత నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. తనతో పాటు తన కుమార్తెకు కూడా ఈ వ్యాధి సోకిందని బలంగా నమ్మింది. భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో, అతనికి తెలియకుండా అనేక చోట్ల పసరు మందులు తీసుకున్నా, ఆమెలోని భయం తొలగిపోలేదు.

విషాదాంతం.. చివరి మాటలు : తన భయం నుంచి బయటపడలేనని నిర్ధారించుకున్న యశోద, దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, కన్నకూతురిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు, ఇంటి డోర్లపై, చాక్‌బోర్డుపై “లక్కీ (కుమారుడు), మీ నాన్న జాగ్రత్త” అని చివరి మాటలు రాసింది. ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

ఒక ఆధారం లేని అనుమానం, సరైన వైద్య సమాచారంపై అవగాహన లేకపోవడం, మానసిక కుంగుబాటును సకాలంలో గుర్తించకపోవడం.. ఒక కుటుంబాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి యశోద విషాంతమే నిలువెత్తు సాక్ష్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad