రాజమండ్రి నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరం అని, అత్యంత శోచనీయం అన్నారు. మానవతా దృక్పధంతో ఆదుకోవాలి..తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మా నుండి, పార్టీ నుండి, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళామని, ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు.
