Red forte theft: ఢిల్లీలోని చారిత్రక కట్టడమైన ఎర్రకోటలో భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంగణంలో, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరైన ఒక జైన మత కార్యక్రమంలో కోటి రూపాయల విలువైన బంగారు కలశం చోరీకి గురైంది.
ప్రస్తుతం ఎర్రకోటలో జైనుల ‘దశలక్షణ మహాపర్వం’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం వ్యాపారవేత్త సుధీర్ జైన్ తన పూజలో ఉపయోగించే విలువైన కలశాన్ని తీసుకొచ్చారు. ఈ కలశంలో సుమారు 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదగబడి ఉన్నాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యక్రమానికి హాజరైనప్పుడు, ఆయనకు స్వాగతం పలికే తొందరలో సిబ్బంది నిమగ్నమై ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తి వేదికపై ఉన్న ఈ కలశాన్ని దొంగిలించాడు. కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చోరీ ఘటన దేశ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రధానమంత్రి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసే ఎర్రకోటలో భద్రతా లోపాలు బయటపడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఒక డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమైనందుకు ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


