Rs.100 Crore GST Evasion Fraud: తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున పన్ను ఎగవేత మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థ, కిషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పి కంపెనీ పాల్పడిన జీఎస్టీ మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా, అధికారులు ఎస్‌పి రోడ్‌లోని కంపెనీ కార్పొరేట్ కార్యాలయం, సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ గోదాం, అలాగే మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లపై సమన్వయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలోనే భారీ మోసం బట్టబయలైంది.
ALSO READ: https://teluguprabha.net/crime-news/telangana-tribal-woman-body-carried-on-cot-no-road/
ప్రాథమిక విచారణలో, ఈ సంస్థ నిజానికి ఎలాంటి వస్తువులను తరలించకుండానే భారీ విలువైన కాపర్ ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి నకిలీ పన్ను బిల్లులను జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాళీ వాహనాలను తెలంగాణ నుండి మహారాష్ట్రకు పంపించి, డాక్యుమెంట్లలో మాత్రం భారీగా సరుకులు రవాణా చేసినట్లు చూపించారు. ఈ మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అందించిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వాహనాలు రద్దీ లేని సమయంలో ప్రయాణించినా, ఈ-వే బిల్లులపై వాటిని సరుకులతో వెళ్ళినట్లు చూపినట్లు డేటా స్పష్టం చేసింది. ఈ సంస్థ నకిలీ లావాదేవీల ద్వారా సుమారు రూ. 33.20 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందినట్లు గుర్తించారు. ఇది తెలంగాణలో బయటపడిన ఈ రకమైన మొదటి జీఎస్టీ మోసంగా అధికారులు భావిస్తున్నారు.
తనిఖీల సందర్భంగా, అధికారులు కంపెనీకి చెందిన ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్క్‌లు, సీసీటీవీ ఫుటేజ్ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్ మరియు రజనీష్ కీషాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీకి వాణిజ్య పన్నుల శాఖ తరపున అధికారిక ఫిర్యాదు దాఖలు చేశారు.


