న్యూ ఇయర్ శుభాకాంక్షల పేరిట వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ప్రకటనలో సూచించారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షల చిత్రాలు, సందేశాలను మీ పేరు మీద తయారు చేసుకోవచ్చని వచ్చే లింకుల ద్వారా క్రియేట్ చేసుకొని ఇతరులకు పంపొద్దని పేర్కొన్నారు. లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు వస్తుంటాయని, వాటిపై క్లిక్ చేయొద్దని సూచించారు.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ కాజేస్తారన్నారు. ఇలాంటి సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి వస్తే మన సమాచారమంతా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందన్నారు. సైబర్ కేటుగాళ్లు రానున్న రెండు, మూడు రోజులు ఇలాంటి మెసేజ్‌లను పంపుతుంటారని, కావున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.