Saturday, November 15, 2025
HomeTop StoriesGaming app: గేమింగ్ యాప్‌ల బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య: లక్షల్లో అప్పులు..!

Gaming app: గేమింగ్ యాప్‌ల బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య: లక్షల్లో అప్పులు..!

Police Constable suicide: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వ్యసనాలు సంగారెడ్డి జిల్లాలోని ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు తీశాయి. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కటారి సందీప్ కుమార్ (25) అనే కానిస్టేబుల్ నిన్న మధ్యాహ్నం పట్టణంలోని మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్ద తన సర్వీస్ రివాల్వర్‌తో ఛాతిపై కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ వ్యసనం కారణంగా లక్షల రూపాయలు అప్పులపాలు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

పోలీసుల ప్రాథమిక విచారణలో, సందీప్ కుమార్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్‌లకు బానిసగా మారి, వాటిలో సుమారు రూ 15 లక్షల వరకు డబ్బు పోగొట్టుకున్నట్లు వెల్లడైంది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి తోటి సహచరులు, స్నేహితుల వద్ద అప్పులు చేయగా, వారి నుంచి తిరిగి చెల్లించమని ఒత్తిడి పెరగడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.

ఆఖరి క్షణాలు:

ఆత్మహత్యకు ముందు, సందీప్ కుమార్ ‘వెల్‌విషర్స్’ పేరుతో తన బ్యాచ్‌మేట్స్, స్నేహితులతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. అందులో తన తల్లిదండ్రులకు, సోదరికి క్షమాపణలు చెబుతూ చివరి సందేశాలను పంపాడు. చివరికి “అమ్మా, చెల్లి సారీ” అనే సందేశాన్ని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ఉపయోగించిన సర్వీస్ పిస్టల్ (9-ఎంఎం)ను ‘బెల్ ఆఫ్ ఆర్మ్స్’ నుంచి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల దర్యాప్తు:

సమాచారం అందుకున్న సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, ఇతర ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సందీప్ ఆర్థిక పరిస్థితి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయిన వివరాలపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీఎన్‌ఎస్‌ఎస్ (BNSS) సెక్షన్ 194 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు.

కల్హేర్ మండలం వాసి అయిన సందీప్ కుమార్ 2024 బ్యాచ్ కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంతోషించిన కుటుంబం, ఒక్కగానొక్క కుమారుడు ఇలా ప్రాణం తీసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన మరోసారి ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రమాదకరమైన ప్రభావాన్ని, ముఖ్యంగా యువతపై అవి చూపిస్తున్న తీవ్ర పరిణామాలను ఎత్తిచూపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad