బీహార్ లో 2016 నుండీ సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. కానీ.. అక్కడ మద్యం ఏరులై పారుతోంది. రెండు రోజుల క్రితమే పోలీసులు ఏకంగా ఎక్సైజ్ పీఎస్ లో ఖైదీలతో కలిసి మద్యం తాగుతూ ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దాంతో దొంగల్ని, నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. పోలీసులనే అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. తాజాగా.. బీహార్లో కల్తీ మద్యం తాగి స్కూల్ ప్రిన్సిపల్ సహా ముగ్గురు మృతి చెందారు.
వైశాలి జిల్లాలోని మెహ్నర్‌లో జరిగిన విందుకు ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ వచ్చారు. అక్కడ దొరికిందే సందు అన్నట్టుగా.. ఎంచక్కా మద్యం సేవించాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై.. మరణించాడు. అదే వేడుకకు వచ్చిన మరో ఇద్దరు సైతం మద్యం సేవించి మరణించారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. విందులో కల్తీ మద్యం సప్లై చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.