అనంతపురం SR జూనియర్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థి శ్రీకాంత్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతదేహంతో కాలేజీ ఎదుట బంధువులు నిరసన చేస్తున్నారు.
విద్యార్థి మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్నారు. విద్యార్థి శ్రీకాంత్ మృతి చెందాడని ఉదయం 6 గంటలకే తెలిసినా కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.న్యాయం జరిగే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలమూరు రోడ్డులోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ(SR JR.COLLEGE)లో ధర్మవరం మండలం మల్కాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఇంటర్ చదువుతున్నాడు. ఈ యువకుడు కళాశాల వెనుక వైపు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. రాత్రి సమయంలో వసతి గృహం నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ ఉదయం చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. గమనించిన విద్యార్థులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
విద్యార్థి మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఎస్‌ఆర్ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి మృతికి గల కారణాలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ మృతి గల కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులు ఉండటంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.