Telangana DCA responds on drugs case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల చర్లపల్లిలో డెకాయ్ ఆపరేషన్‌ను మహారాష్ట్ర ఎన్‌సీబీ చేపట్టింది. అయితే దీనిపై తెలంగాణ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. ఈ ఆపరేషన్‌లో బయటపడిన మెఫిడ్రిన్ అనేది మెడిసిన్ కాదని తెలంగాణ డీసీఏ అధికారులు తెలిపారు. మెఫిడ్రిన్ అనేది మెడిసిన్ కాదు కాబట్టి.. తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మెఫిడ్రిన్ డ్రగ కంట్రోల్ పరిధిలోకి రాదని అన్నారు. ఎన్‌డీపీస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్‌సీబీ, డీఆర్‌ఐకే ఉంటుందని తెలంగాణ డీపీఏ అధికారులు తెలియజేశారు.
మెున్న వాళ్లు..ఇవ్వాళ మనోళ్లు: మెున్న తెలంగాణలో మహారాష్ట్ర ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేపట్టగా.. ఈ రోజు ముంబైలో తెలంగాణ ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో అరెస్ట్ అయినవాళ్లలో ఎక్కువ మంది ముంబై, పూణేకు చెందిన వారేనని సమాచారం.
Drug Racket Exposed in Hyderabad: మేడ్చల్ జిల్లాలో శనివారం సాయంత్రం మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ముంబాయిలో తీగ లాగితే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ డొంక బయటపడింది. మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడిలో పెద్దఎత్తున డ్రగ్స్ తయారుచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైనట్లుగా తెలిపారు. 32 వేల లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 13 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళ అరెస్ట్ తో గుట్టురట్టు: కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో తయారైన డ్రగ్స్.. దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన మహిళ అరెస్ట్ తో ఈ డ్రగ్స్ గుట్టు మొత్తం బయటపడిందని అన్నారు. మహారాష్ట్ర పోలీసుల దాడులతో.. తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్ మొత్తం గుట్టురట్టయింది. కెమికల్ ఫ్యాక్టరీలో పెద్దఎత్తున ఎండీ డ్రగ్ తయారీని పోలీసులు గుర్తించారు.
ఫ్యాక్టరీపై మెరుపుదాడి: మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై హైదరాబాద్ లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో తమ గూఢచారులను రంగంలోకి దించి రహస్య ఆపరేషన్ ను నిర్వహించారు. ముఠా మూలాలు చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకుని.. ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ‘వాఘ్దేవి ల్యాబ్స్’ అనే నకిలీ లైసెన్స్‌తో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


