తమ కళాశాలకు చెందిన విద్యార్థి అభిలాష్ (20) మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెల 1వ తేదీన అనుమతి లేకుండా బయటికి వెళ్లి 27వ తేదీన బావిలో శవమై తేలాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకొని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థి మృతి చెందడం బాధాకరమనీ, అతడి తల్లిదండ్రుల బాధ ఎవరూ తీర్చలేనిదని పేర్కొన్నారు. అయితే విద్యార్థి మృతిని, వారి తల్లిదండ్రుల బాధను పట్టించుకోకుండా కొందరు మీడియాలో పనిగట్టుకొని తప్పుడు కథనాలు రాసి వారిని మరింత క్షోభ పెట్టారని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై చర్య తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు.
జ్యోతిష్మతి బ్రాండ్ ఏనాటికీ తగ్గదు..
తమ కళాశాలకున్న బ్రాండ్ ఏనాటికీ తగ్గదని జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకొని తప్పుడు కథనాలు రాసిన తమకు జరిగిన నష్టమేమీ లేదన్నారు. పత్రికల్లో పని చేస్తున్న వారంతా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలేగానీ, ఇలా తప్పుడు కథనాలు రాయడం సమంజసం కాదన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలనీ, ఒకవేళ విద్యార్థి మృతికి తాను కారణమైన శిక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.