Wife killed husband: మధ్యప్రదేశ్‌లో అక్రమ సంబంధం ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. తన మూడో భార్య ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
భయాలాల్ రాజక్ అనే వ్యక్తికి మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య విడిచిపెట్టగా, రెండవ భార్యతో పిల్లలు లేకపోవడంతో విడాకులిచ్చాడు. ఆ తర్వాత రెండవ భార్య చెల్లెలు మున్నీ అలియాస్ విమల రాజక్‌ను మూడో వివాహం చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత మున్నీ, లల్లు కుష్వాహా అనే ఆస్తి వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న మున్నీ, ప్రియుడితో కలిసి ఒక పథకం వేసింది. ఆగస్టు 30న భయాలాల్ ఒంటరిగా ఉన్నప్పుడు లల్లు, అతని స్నేహితుడు ధీరజ్ కలిసి ఇనుప రాడ్‌తో తలపై కొట్టి అతడిని చంపారు. అనంతరం మృతదేహాన్ని తాళ్లతో కట్టి, దుప్పటి, చీరలో చుట్టి సమీపంలోని బావిలో పడవేశారు.
కొన్ని రోజుల తర్వాత భయాలాల్ మాజీ భార్య బావిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలాానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మున్నీ, ఆమె ప్రియుడు లల్లు, అతని స్నేహితుడు ధీరజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు.


