మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు నిత్యాగ్నిహోత్రంలా మండుతూ కాలుష్య కుంపటిగా తయారైంది. రహదారిపై నిత్యం ప్రయాణించే వారిపై విషపూరిత వాయువులను వెదజల్లుతోంది. ప్రజారోగ్యాలకు హానికరంగా మారిన వాయు కాలుష్యంపై స్థానికులు, రైతులు చేసిన ఫిర్యాదులపై నియంత్రణ కరువైందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలు గుట్టలు, గుట్టలుగా పడి ఉన్నాయి. దీంతో కొంత కాలంగా డంపుయార్డులో పెరికోపోయిన, కుంపటిను నిప్పుతో వెలిగించారు. దీంతో ఈ వ్యర్థాల నుండి దట్టమైన పొగలు వెలువడుతూ వాయు కాలుష్య ఉత్పత్తి కేంద్రంగా స్థానిక డంపింగ్ యార్డు మారింది. వాస్తవానికి ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయడంతోపాటు అందులోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను కూడా వేరు చేయాలి. ఇలా వేరు చేసిన తడి చెత్తను కంపోస్ట్ కింద మార్చాలి. కానీ స్థానికంగా ఆ పని జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి డంప్ యార్డు చెత్తలో,పందులు,కుక్కలు,రబ్బరు, ప్లాస్టిక్, థర్మకోల్, ఫైబర్ మొదలైన పనికిరాని వస్తువులను వేరు చేయడంలేదంటున్నారు. స్థానిక ప్రజలకు కాలుష్య నియంత్రణ మండలి చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానిక ప్రజలు
తొర్రూరు మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డులో చెత్త కాలుతున్న మంటలను అదుపులోకి తెచ్చి, వాయు కాలుష్యం లేకుండా చూడాల్సిన అధికారులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గల తండాలు, కాలనీలు, గ్రామాలే కాకుండా యార్డు పక్కనుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, ఇంకోపక్క ఉన్న అచ్చుతండాకు డంపింగ్ యార్డు కాలిపోవడంతో వెలువడుతున్న దుర్వాసన పొగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఈ కాలుష్యం వల్ల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలకు రోగాలు వచ్చి, ఇబ్బందులు ఎదురై, ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యూలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిధులు ఫుల్..పనులు నిల్
తొర్రూర్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ నిర్మించడానికి గతంలో నిధులు ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులను ఎవరు మాయం చేశారన్న సందేహం పోలేదు. కానీ ప్రజలకు మాత్రం మాయమాటలు చెప్పి డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ప్రజలకు ఎటువంటి హామీ జరగకుండా చూసుకుంటామని మున్సిపల్ అధికారులు ప్రజలకు మాటిచ్చారు. కానీ ఇచ్చిన మాటను తుంగలో తొక్కిన మున్సిపల్ అధికారులు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడంతోపాటు డంపింగ్ యార్డ్ లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ చైర్మన్..భయబ్రాంతులకు గురిచేస్తున్నారు
“డంపింగ్ యార్డ్ పొగతో మా తండాలో స్థానిక ప్రజలు శ్వాసకోస ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ ను పూర్తిగా ఇక్కడి నుండి తొలగించాలని పలుసార్లు అధికారులకు అర్జీ పెట్టుకున్నాము. కానీ మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మీరు ఇక్కడ నివసించవద్దు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని, పోలీసు వారిని పంపించి బెదిరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మాకు, మా పిల్లలకు న్యాయం చేకురే విధంగా స్పందించాలని కోరుకుంటున్నాం”-బానోత్ వీరన్న..అచ్చుతండా రైతు.