Tirumala Dairy: చెన్నైలో తిరుమల డెయిరీ మేనేజర్‌గా పనిచేస్తున్న నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం ఏపీలో విశాఖకు చెందిన బొల్లినేని నవీన్ చెన్నైలోని మాధవరంలో ఉన్న తిరుమల డెయిర్‌లో ట్రెజరీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల కంపెనీ అధికారులు నిర్వహించిన అడిటింగ్‌లో తప్పుడు లెక్కలు బయటపడ్డాయి. నవీన్ రూ.40కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.
డబ్బులు అవకతవకలపై అధికారులు నిలదీయడంతో తన తప్పును అంగీకరించిన నవీన్.. డబ్బును ఒక్కరోజులోనే తిరిగి ఇస్తానని తెలిపాడు. అనంతరం డబ్బు సర్దుబాటుకాకపోవడంతో చెన్నై బ్రిటానియానగర్‌లో ఉన్న తన సొంత షెడ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ చేసుకునే ముందుకు తనను ఐదుగురు అధికారులు వేధిస్తున్నారంటూ సోదరీమణులకు ఈమెయిల్ పంపించినట్లు గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు హుటాహుటిన చెన్నై చేరుకోగా.. అప్పటికే నవీన్ చనిపోయాడు.
నవీన్ రూ.40కోట్లు మోసానికి పాల్పడినట్లు జూన్ 24న చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్‌కు కంపెనీ లీగల్ మేనేజర్ తమిముల్ అన్సారీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నీవీన్ ముందస్తు బెయిల్‌కు కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పిటిషన్‌పై రెండు సార్లు విచారణ వాయిదా పడింది. దీంతో నవీన్‌ను ఇంకా విచారించలేదని పోలీసులు తెలిపారు. కానీ ఈలోపే తన సోదరీమణులకు మెయిల్ పంపి ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.


