టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న డీఈ రమేష్.. కస్టడీ కోరుతూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. 10 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై నిందితుడి తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో డీఈ రమేష్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ మాస్ కాపీయింగ్ కు పాల్పడిన నిందితుడు భారీగా డబ్బు సంపాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఓ ఇన్విజిలేటర్ సాయంతో ప్రశ్నలు తెలుసుకున్న డీఈ రమేష్ బ్లూటూత్ సాయంతో పరీక్షా కేంద్రంలో కూర్చున్న వాళ్లకు సమాధానాలు చేరవేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సురేష్ అనే వ్యక్తి సాయంతో డీఏవో, ఏఈఈ ప్రశ్నాపత్రాలను లీక్ చేసి చాలా మందికి అమ్ముకున్నట్లు దర్యాప్తులో తేలింది. రమేష్ తో చేతులు కలిపిన ఇన్విజిలేటర్లతో పాటు అతని నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వారిని గురించి కూడా కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే డీఈ రమేష్ ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే.. మరికొంత మంది గురించి తెలిసే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారు.