ములుగు జిల్లాలో వాజేడు ఎస్ఐ (Wazedu SI) ఆత్మహత్య సంచలనం రేపింది. సోమవారం ఉదయం ఒక రిసార్ట్ లో ఎస్సై రుద్రారపు హరీష్ తన సర్వీస్ రివాల్వర్ తో షూట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఎస్సై ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు ఆదివారం రాత్రి రిసార్ట్ లో ఆయనతో పాటు ఓ యువతి కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వాజేడు ఎస్సై (Wazedu SI) ఆత్మహత్యకి మొదటి నుంచి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడమే కారణమని అంతా భావించారు. నిజానికి ఎస్సై ఆత్మహత్యకి ప్రేమ వ్యవహారమే కారణం.. కానీ, ఇక్కడే భారీ ట్విస్ట్ నెలకొంది.
ఎస్సై హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులతో ప్రేమలో ఉన్నట్టు తేలింది. ఆ ముగ్గురిపైనా కేసులు కూడా పెట్టినట్లు సమాచారం. డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి ప్రేమ పేరుతో లొంగదీసుకుంటుందని, ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్‌ను కూడా ప్రేమలోకి దించిందని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 14న హరీష్ కి వేరే అమ్మాయితో నిశ్చితార్థానికి ముహూర్తం కూడా ఖరారైంది. అంతలోనే హరీష్ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబసభ్యుల్ని శోకసంద్రంలో ముంచింది.
అయితే హరీష్ ఆత్మహత్య చేసుకున్న రిసార్ట్ లో ఆ యువతి కూడా ఉంది. దీంతో యువతి బెదిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక తాను హనీ ట్రాప్ లో పడ్డానని తెలిసి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రాణాలు తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.