Uttar Pradesh Rakhi Horror : పవిత్రమైన రాఖీ పండుగ రోజున ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. ఉదయం ఏ చేతికి రాఖీ కట్టించుకున్నాడో, అదే చేత్తో ఆ సోదరి జీవితాన్ని చిదిమేశాడో కామాంధుడు. రక్షణగా ఉంటానని ప్రమాణం చేయాల్సిన అన్నే.. రక్షకుడి ముసుగులో ఉన్న రాక్షసుడిగా మారాడు. మద్యం మత్తులో కన్నూమిన్నూ కానక, బంధుత్వాన్ని మరిచి, పవిత్ర బంధాన్ని అపహాస్యం చేస్తూ అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డాడు. ఉదయం రాఖీ కట్టించుకుని, రాత్రికే ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు, నేరం నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, చివరకు పోలీసులకు ఎలా చిక్కాడనే విషయాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది..?
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో శనివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 33 ఏళ్ల సుర్జీత్ అనే వ్యక్తి రక్షాబంధన్ సందర్భంగా తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ తన సోదరి వరుసైన 14 ఏళ్ల బాలికతో ఆప్యాయంగా రాఖీ కట్టించుకున్నాడు. ఆ సమయంలో అతడి మనసులో ఇంతటి ఘోరమైన ఆలోచన ఉందని ఎవరూ ఊహించలేకపోయారు.
మద్యం మత్తులో ఘాతుకం : పండుగ ముగించుకుని వెళ్లిన సుర్జీత్, ఆ రోజు రాత్రి బాగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో తిరిగి తన బంధువు ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న 14 ఏళ్ల బాలికపై అతడి కన్ను పడింది. కామంతో కళ్లు మూసుకుపోయిన సుర్జీత్, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన నేరం బయటపడుతుందన్న భయంతో, ఆ తర్వాత బాలికను దారుణంగా హత్య చేశాడు.
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం : తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సుర్జీత్ ఒక పథకం పన్నాడు. బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా, బాలిక మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా తన స్వగ్రామానికి పారిపోయాడు. పక్కగదిలో నిద్రిస్తున్న బాలిక తండ్రి, మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూడగా, కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో నిర్ఘాంతపోయాడు.
పోలీసుల దర్యాప్తు.. నిందితుడి నాటకం : బాధిత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు, బాలిక శరీరంపై ఉన్న రక్తపు మరకలను చూసి ఇది ఆత్మహత్య కాదని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇంతలో, ఏమీ ఎరగనట్టు అక్కడికి చేరుకున్న సుర్జీత్, పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తుండగా, తానే ముందుకొచ్చి సమాధానాలు చెబుతూ వారిని మాట్లాడకుండా అడ్డుకున్నాడు. అతని ప్రవర్తన పోలీసులకు అనుమానం కలిగించింది.
పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన నిజాలు : బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. బాలికపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో, సుర్జీత్‌పై అనుమానం బలపడిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. ఉదయం రాఖీ కట్టిన చెల్లినే, రాత్రికి అతి కిరాతకంగా అంతమొందించిన ఆ దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పవిత్రమైన బంధానికే మచ్చ తెచ్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


