Crimes in yadadri district: యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అతి కిరాతకంగా హత్య చేయించింది. ఆ తర్వాత ఈ దారుణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే, సోమవారం కాటేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. ఉదయం సమయంలో బైక్‌పై వెళ్తున్న స్వామిని వెనుక నుండి కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఈ ప్రమాదంపై పోలీసులకు అనుమానం రావడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. స్వామి మరణం ప్రమాదం కాదని, అతని భార్యే హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు కారును అద్దెకు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఒక్కసారి ఢీకొట్టినా స్వామి చనిపోకపోవడంతో, మరోసారి అతని మీదుగా కారును నడిపినట్లు విచారణలో తేలింది.
స్వామి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దారుణం వెనుక ఉన్న కుట్ర బట్టబయలైంది. ఆమెతో పాటు ప్రియుడు, బావమరిది, సుఫారీ కిల్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.


