Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుExtramarital affair : మనుమళ్లను ఎత్తుకునే వయసులో..కామంతో కట్టుకున్నోడినే కాటికి పంపింది!

Extramarital affair : మనుమళ్లను ఎత్తుకునే వయసులో..కామంతో కట్టుకున్నోడినే కాటికి పంపింది!

Extramarital affair leads to murder : “నా భర్త కనిపించడం లేదు సార్..!” పోలీసుల ముందు ఒక మహిళా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్ల వెనుక, తన ప్రియుడితో కలిసి కన్న భర్తనే కడతేర్చిన ఓ కిరాతక కుట్ర దాగి ఉంది. ఈ మిస్టరీ కేసును ఛేదించడంలో పోలీసులు ఆడిన మైండ్ గేమ్, ఎవరినీ నమ్మనీయకుండా చేస్తుంది.

- Advertisement -

వయసు మళ్లిన వేళ, వావివరుసలు మరిచి, తనకంటే సగానికి పైగా చిన్నవాడైన ఒక యువకుడితో పెట్టుకున్న అక్రమ సంబంధం, చివరికి ఆమెను హంతకురాలిగా మార్చింది. భర్తను చంపిన తర్వాత, ఏమీ తెలియనట్లు పోలీసుల వద్దకు వెళ్లి నాటకాలు ఆడింది. కానీ పోలీసులు అంత తెలివితక్కువవారు కాదు. మృతదేహం కోసం వెతుకులాట, నిందితురాలి వాంగ్మూలంలో ఉన్న లొసుగులు, కాల్ డేటా ఆధారంగా ఈ హంతకులను గుర్తించారు. చివరికి, ఆమె కన్నీళ్లే ఆమెను పట్టిచ్చాయి.

నాటకానికి తెరలేపింది : కర్ణాటక, చిక్కమగళూరు జిల్లా కడూరులో దర్జీ పనిచేసే సుబ్రమణ్య (60) అదృశ్యం కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు రాబట్టారు. జూన్ 2న, సుబ్రమణ్య భార్య మీనాక్షమ్మ (56) తన భర్త మే 31 నుంచి కనిపించడం లేదంటూ కడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బంధువుల ఇళ్లలో, తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదని కన్నీటిపర్యంతమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఒక్కో ఆధారం.. వీడిన మిస్టరీ : పోలీసులు సుబ్రమణ్య మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయగా, అది స్విచ్ఛాఫ్ అని వచ్చింది. సరిగ్గా మరుసటి రోజు, జూన్ 3న, రైల్వే ట్రాక్‌పై సగం కాలిన మృతదేహం ఒకటి లభ్యమైందని రైల్వే పోలీసులు సమాచారం అందించారు. దీంతో అనుమానం వచ్చిన కడూరు పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టారు. సుబ్రమణ్య దర్జీ దుకాణం సమీపంలోని కెమెరాలో, మే 31న అతను ప్రదీప్ (33), అతని స్నేహితులు సిద్ధేష్, విశ్వాస్‌లతో కలిసి కారులో ఎక్కిన దృశ్యాలు పోలీసులకు లభ్యమయ్యాయి.

విచారణలో కక్కిన నిజాలు : సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రదీప్, సిద్ధేష్, విశ్వాస్‌లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, వారు అసలు నిజాన్ని కక్కేశారు. సుబ్రమణ్యను హత్య చేసి, మృతదేహాన్ని పడేసినట్లు అంగీకరించారు. దీంతో రైల్వే ట్రాక్‌పై దొరికింది సుబ్రమణ్య మృతదేహమేనని పోలీసులు నిర్ధారించారు.

భార్యే సూత్రధారి.. కాల్ డేటాతో బట్టబయలు : అయితే, ఈ హత్య వెనుక సుబ్రమణ్య భార్య మీనాక్షమ్మ ప్రమేయం ఉందని ప్రదీప్ వాంగ్మూలం ఇచ్చాడు. కానీ, ఆమెను అరెస్టు చేయడానికి పోలీసుల వద్ద ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. భర్త మరణవార్త విని ఆమె గుండెలవిసేలా రోదించడంతో, మొదట పోలీసులు కూడా ఆమెను అనుమానించలేదు. అయితే, మీనాక్షమ్మ, ప్రదీప్‌ల కాల్ డేటా రికార్డులను (CDR) పరిశీలించగా, గత ఆరు నెలలుగా వారిద్దరూ నేరుగా ఫోన్లో మాట్లాడుకోలేదని తేలింది. కానీ, మీనాక్షమ్మ తరచూ ఓ నంబరుకు ఫోన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నంబరుపై ఆరా తీయగా, అది ప్రదీప్ తల్లి పేరు మీద ఉండగా, దాన్ని ప్రదీప్ వాడుతున్నట్లు సాంకేతిక దర్యాప్తులో తేలింది. దీంతో ఈ హత్య వెనుక సూత్రధారి మీనాక్షమ్మే అని పోలీసులకు స్పష్టమైంది.

హత్య జరిగిందిలా : పక్కా పథకం ప్రకారం, మే 31న ప్రదీప్, అతని స్నేహితులు సుబ్రమణ్యతో మాటలు కలిపారు. మద్యం తాగుదామని నమ్మించి కారులో సక్రెపట్న సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించాక, మద్యం మత్తులో ఉన్న సుబ్రమణ్య గొంతును ప్రదీప్ కిరాతకంగా కోసి చంపాడు. అనంతరం, మృతదేహాన్ని కాల్చివేసేందుకు ప్రయత్నించగా, అది పూర్తిగా కాలకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

అక్రమ సంబంధమే కారణం :  ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి, మనవళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో మీనాక్షమ్మ దారి తప్పింది. నాలుగేళ్ల క్రితం, దర్జీ అయిన ప్రదీప్‌తో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇటీవల ఈ విషయం భర్త సుబ్రమణ్యకు తెలియడంతో, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. పక్కాగా పథకం రచించి, భర్తను హత్య చేయించి, ఏమీ ఎరగనట్టు నాటకమాడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad