Saturday, November 15, 2025
HomeTop StoriesMystery:బెంగాల్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం.. వీడని మిస్టరీపై పరిశోధన!

Mystery:బెంగాల్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం.. వీడని మిస్టరీపై పరిశోధన!

World war 2 bomb in bengal: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి భారీ బాంబు లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. బీర్‌భూమ్ జిల్లాలోని బోల్‌పూర్ సమీపంలోని లౌదాహా గ్రామంలో అజయ్ నది ఒడ్డున ఈ బాంబును గుర్తించారు. సుమారు ఒక నెల క్రితమే స్థానిక మత్స్యకారులు నది ఒడ్డున ఒక సిలిండర్ ఆకారంలో ఉన్న లోహపు వస్తువును గమనించారు, అయితే మొదట్లో దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరకు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

- Advertisement -

పోలీసులు ఈ సమాచారాన్ని సమీపంలోని ఆర్మీ స్థావరంలోని అధికారులకు అందించారు. వెంటనే స్పందించిన సైన్యం, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాంబును నిర్వీర్యం చేసేందుకు ఆర్మీ అధికారులు నిర్ణయించారు. దీనికి ముందు, ముందు జాగ్రత్త చర్యగా, బాంబు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా మూసివేశారు. చుట్టుపక్కల ప్రజలను అటువైపు వెళ్లవద్దని సూచించారు.

సైన్యం పర్యవేక్షణలో బుధవారం నాడు నియంత్రిత పేలుడు ద్వారా బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేశారు. అయితే, ఈ పేలుడు యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. పేలుడు జరిగిన సమయంలో చుట్టుపక్కల గ్రామాల్లో భూమి కంపించినట్లుగా అక్కడి స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన తర్వాత స్థానికంగా నెలకొన్న భయాందోళనలు తొలగిపోయాయని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని బీర్‌భూమ్ జిల్లా సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

వీడని మిస్టరీ:

అయితే, 80 ఏళ్లు గడిచినా ఇంకా క్రియాశీలకంగా ఉన్న ఈ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు బోల్‌పూర్ సమీపంలోని ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందనే దానిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. లౌదాహా గ్రామం ప్రఖ్యాత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీకి దగ్గరగా ఉంది. యుద్ధ సమయంలో ఈ ప్రాంతంలో ఎలాంటి వైమానిక స్థావరాలు ఉన్నట్లుగా స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేకపోవడంతో, బాంబు ఆ ప్రాంతానికి ఎలా వచ్చిందనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

కాగా, గతేడాది కూడా పశ్చిమ బెంగాల్‌లోని ఝార్గ్రామ్ జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం కావడం, దానిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఝార్గ్రామ్ ప్రాంతంలో ప్రపంచ యుద్ధం సమయంలో ఫైటర్ విమానాల కోసం ఎయిర్ స్ట్రిప్ ఉండేదని, బరువు తగ్గించుకోవడం కోసం విమానాలు కొన్నిసార్లు బాంబులను జారవిడిచేవని అప్పుడు తెలిసింది. కానీ, బీర్‌భూమ్‌లోని ఈ ప్రస్తుత సంఘటన విషయంలో అలాంటి పూర్వ చరిత్ర లేకపోవడంతో పరిశోధన కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad