Young Man Dies After Suspected Drug Overdose: మత్తు ప్రాణాలు తీస్తుంది, బంగారం లాంటి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు యువత పెడచెవిన పెడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ డ్రగ్స్ పార్టీ హైదరాబాద్‌లో కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 805 లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్న ఓ యువకుడు అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మృతి చెందాడు.
రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అహ్మద్ అలీ (28) అనే యువకుడు, అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులతో కలిసి కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అహ్మద్ అలీ గత రాత్రి తన స్నేహితులతో కలిసి ఫ్లాట్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో వారు మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికంగా డ్రగ్స్ సేవించడం వల్ల అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
అహ్మద్ అలీ స్పృహ తప్పిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికే అహ్మద్ అలీ మృతి చెంది ఉన్నాడు. ఫ్లాట్‌లో అహ్మద్ అలీతో పాటు అతని స్నేహితుడు, ఇద్దరు యువతులు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్‌తోనే అలీ మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ పార్టీలో పాల్గొన్న మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారికి డ్రగ్స్ ఎక్కడ నుండి లభించాయి? ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ పెడ్లర్ల భరతం పట్టడానికి పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ, యువత మత్తుకు బానిసలై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. యువత ఇలా డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్స్ తీసుకుంటే భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా, చివరికి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. రాజేంద్రనగర్ డ్రగ్స్ కేసులో పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.


