Crime in Gujarath: గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో ఒక బర్త్‌డే పార్టీ విషాదాంతంగా మారింది. కేవలం రూ.50 విషయంలో తలెత్తిన చిన్నపాటి గొడవ ఒక యువకుడి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన సూరత్‌లోని కతర్గామ్ ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం, బర్త్‌డే పార్టీలో స్నేహితులైన సంజయ్ మకనా (21), గోవింద్ మితాపురా ఒకరికొకరు రూ.50 బాకీ ఉన్నట్లుగా వివాదం మొదలైంది. ఈ గొడవ కాసేపటికే తీవ్రంగా మారి వాదన, తోపులాట వరకు వెళ్లింది. కోపంతో ఊగిపోయిన గోవింద్ మితాపురా అక్కడే ఉన్న ఒక కత్తిని తీసుకుని సంజయ్ ఛాతీలో పొడిచాడు.
తీవ్రంగా గాయపడిన సంజయ్‌ను వెంటనే అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం గోవింద్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో కేవలం రూ.50 విషయంలోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సమాజంలో క్షణికావేశాలు యువకులను ఎలా ప్రమాదకరమైన చర్యలకు ప్రేరేపిస్తున్నాయో ఈ సంఘటన మరోసారి వెల్లడించింది.


