శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. శ్రీ జ్వాల నరసింహ స్వామి చెంచులక్ష్మి అమ్మవార్లకు కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం ఎగువ అహోబిలం నరసింహస్వామి ఆలయం ఎదురుగానున్న కళ్యాణ మండపంలో పెళ్లి పెద్దగా అహోబిలం పీఠాధిపతి శ్రీ శ్రీ వన్ శఠగోప యతింద్ర మహాదేశికన్ వ్యవహరించగా, జ్వాలా నరసింహస్వామి చెంచు లక్ష్మి అమ్మవారి లను ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ మండపంలో కొలువయ్యారు. కళ్యాణ మండపాని పూల అలంకరణలతో విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు.
అంతకుముందు పద్మశాలీల ఆడపడుచు అయినా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు నిర్వహించారు. అశేష భక్త జనముల మధ్య నరసింహ స్వామి గోవిందా నామస్మరణతో మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ వేద పండితులు మంత్రోత్సవములతో స్వామి అమ్మవార్ల కళ్యాణ తంతువు ముగిసింది.
అంతకుముందు సాయంత్రం జ్వాలా నరసింహస్వామి ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఆశనుడై భక్తులకు దర్శనమిచ్చారు . దిగు అహోబిలంలో ఉదయం వేణుగోపాల స్వామి అలంకారంలో ప్రహ్లాద వరుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దర్శనమిచ్చారు. రాత్రి పొన్నచెట్టు వాహనంపై ప్రహల్లాద వరుదుడు ఆశీనుడై నాలుగు మాడల వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
అహోబిలం బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు
అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం 350 మంది పోలీసు సిబ్బందితో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే అహోబిలంలో బ్రహ్మోత్సవాలలో నాటు సారా, జూదము లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా పోలీస్ సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.