చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన ఒంటిమిట్ట(Ontimitta) శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
మంగళవారం ఒంటిమిట్ట టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన సమావేశ మందిరంలో… రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్ రావు, తితిదే ఈఓ జె. శ్యామల రావు, తితిదే జెఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి శ్రీ కోదండరామస్వామివారి కల్యాణోత్సవ ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందన్నారు. అశేష భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా జరిగే ఈ మహోత్సవానికి.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ఈ కళ్యాణోత్సవం జరుగుతోందని, అందులో భాగంగా సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. అత్యంత ప్రధాన్యతతో నిర్వహిస్తున్న మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న పొరపాట్లకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సామర్ధవంతంగా పూర్తి చేయాలన్నారు. సంఘటనలు జరుగకుండా జిల్లా, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు.
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలపై జరుగుతున్న ఏర్పట్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

తితిదే ఈవో జె.శ్యామల రావు మాట్లాడుతూ.. టిటిడిలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి అధికారులను సన్నద్దము చేయడం జరిగిందన్నారు. ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టిటిడి తరపున సంపూర్ణ సహకారాలు అందిస్తున్నామన్నారు.
అంతకు మునుపు తితిదే ఈఓ జె. శ్యామల రావు, తితిదే జెఈఓ వీరబ్రహ్మం శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదికను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా అపరిశీలించి కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చారు.