అయోధ్యలో రామజన్మ భూమిలో కడుతున్న శ్రీరామాలయం కోసం ఎన్నో అరుదైన వస్తువులను ఉపయోగిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న రామాలయంలో శ్రీరాముడి ప్రధాన విగ్రహాన్ని మలిచేందుకు నేపాల్ నుంచి అత్యంత అరుదైన సాలగ్రామాన్ని తెప్పించారు. ఈ భారీ సాలగ్రామంతోనే రామయ్య విగ్రహాన్ని తయారు చేసి, ప్రధాన గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈమేరకు శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు రెండు అరుదైన సాలగ్రామాల వివరాలను వెల్లడించింది.
ఇవి 60 మిలియన్ ఏళ్లకంటే పురాతనమైనవని, ఒక్క రాయి 26 టన్నులుండగా మరొకటి 14 టన్నుల బరువుందని ట్రస్టు వివరించింది. వీటిని దేవ శిలలుగా పిలుస్తారు. ఈ శిలలను నేపాల్ లోని గండకి నది నుంచి సేకరించారు. ముక్తినాథ్ వద్ద ఉన్న ఈ గండకి నదిలోనే సాలగ్రామాలు లభిస్తాయి.
అయోధ్యలో ఉన్నది రామ్ లల్లా మందిరం. అంటే బాల రాముడు, రాముడు బాలుడి అవతారంలో ఉంటారు కనుక ఈ అరుదైన..అత్యంత పురాతన, భారీ సాలగ్రామంతోనే రామయ్య బాలుడి రూపాన్ని చెక్కి, ప్రతిష్ఠాస్తారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతికల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి.