హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో బాగంగా అగ్ని గుండాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం అగ్నిగుండాలు గురువారం తెల్లవారుజామున భంగిమట పరమేశ్వరయ్య వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు ‘శరభ శరభ’ వీరభద్ర అని స్మరిస్తూ, భక్తి పారవశ్యంతో నిప్పు కణికలపై నడిచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిప్పుల కణికలపై నడిచేందుకు పోటీపడ్డారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింప చేయాలని, పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని దేవుడిని కొలిచారు. అగ్నిగుండాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, భద్రత కట్టుదిట్టం చేశారు.