మన సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

దేవాలయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం, వాటికి సాధికారత కల్పించడం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే విషయంలో ఐటీసీఎక్స్ సేవలు అందిస్తోందని అన్నారు. 17 దేశాల నుంచి 1,581 దేవాలయాలను ఏకంచేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఐటీసీఎక్స్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. దేవాలయాల్లో మొదటిసారి ఎన్టీఆర్ అన్నదానాన్ని 1983-84లో ప్రారంభించారు. రూ. 2 వేల కోట్లతో ప్రస్తుతం కార్పస్ ఉంది. రూ. 440 కోట్ల కార్పస్‌తో 2003లో ప్రాణదానం పథకాన్ని ప్రారంభించాం.

ఆలయాల ఆర్థిక వ్యవస్థ రూ.6 లక్షల కోట్లు
సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు దేవాలయ వారసత్వాన్ని, ఆధ్యాత్మికతను, సాంకేతిక బలాన్ని వినియోగించుకోవాలని దేశాన్ని కోరుతున్నా. ఆధ్యాత్మిక సంపద రక్షణలో ఏఐ ఇంటిగ్రేషన్, ఫిన్‌టెక్ సొల్యూషన్స్, విరాళాల వినియోగం, సుస్థిరత, భద్రత, రద్దీ నియంత్రణ, ఆర్థిక పారదర్శకతను ఐటీసీఎక్స్ చెబుతోందని, ఆలయాల నిధుల నిర్వహణ, చట్టపరమైన సవాళ్లకు ఐసీటీఎక్స్ పరిష్కార మార్గాలను చూపింస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ -2047కు అనుగుణంగా ఐసీటీఎక్స్ దేవాలయాల నిర్వహణ, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తూ ప్రపంచంలో దేవాలయాలకు సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. భారతదేశంలోని అన్ని ఆలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఇంతటి విలువైన ఈ సంపదను కాపాడుకోవాలంటే ఆలయాల నిర్వహణలో పారదర్శకత అవసరమని అభిప్రాయపడ్డారు.

ఆలయ బోర్డుల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు అవకాశం
ఆలయ సాంప్రదాయాల్లో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు ఉన్న అనుబంధాన్ని గుర్తించి ఆలయాల ట్రస్ట్ బోర్డుల్లో వారికి అవకాశాలు కల్పించాం. భక్తులు ఆలయాలను సంతోషంగా సందర్శించేందుకు సౌకర్యాలు కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఆలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడటం ప్రభుత్వ విధానంగా పెట్టుకున్నాం. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ వేతనాన్ని రూ.15 వేలకు పెంచాం. వేద విద్యను అభ్యసించిన వారికి నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే దేవాలయాల అభివృద్ధికి రూ.134 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం. పరిమిత ఆదాయం ఉన్న చిన్న దేవాలయాల మనుగడకు దూప దీప నైవేద్యానికి అందించే సాయాన్ని రూ.10 వేలకు పెంచామని అన్నారు.

దేవతల రాజధాని నిర్మిస్తున్నాం
దేవేంద్రుడి రాజధాని స్ఫూర్తితో దేవతల నివాసంగా అమరావతి రాజధాని నిర్మిస్తున్నాం. తిరుమలలో 75 శాతం పచ్చదనం ఉంచేలా చర్యలు తీసుకుంటాం. దేవునికి సేవ చేయడమంటే మానవాళికి సేవ చేయడమే. ఆలయ నిర్వహణలో అవినీతికి తావులేకుండా చేస్తాం. వెంకటేశ్వరస్వామి దగ్గర మోసం చేస్తే ఆయన క్షమించరు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉండాలి.

ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నాం
రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2024లో ఏపీ 21 కోట్ల మంది ఆలయాలను సందర్శించారు. తిరుమల, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఏపీ ఉంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, పంచారామాలు కొలువై ఉన్నాయి. రాష్ట్ర సంస్కృతిని చాటేందుకు దేవాదాయ శాఖ కృషి చేస్తోంది. వేద, ఆగమ సంప్రదాయాల విషయాలలో స్వేచ్ఛను కల్పించాం. దేవాదాయ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టాం. యాత్రికులు, భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ఎక్కడా లేని విధంగా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటున్నాం. దేవాలయాల సందర్శనకు వచ్చే వారికి పూర్తి స్థాయిలో సంతృప్తిని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
