Thursday, October 31, 2024
HomeదైవంTirumala: తిరుమలలో శాస్త్రోకంగా దీపావళి ఆస్థానం.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో శాస్త్రోకంగా దీపావళి ఆస్థానం.. కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala| శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు దర్శనమివ్వనున్నారు.

- Advertisement -

ఈ ఆస్థానం కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సివీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, పారు పత్తేదార్ బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కాగా దీపావళి ఆస్థానం సందర్భంగా ఇవాళ తిరుమలలో అర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీపావళి పర్వదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్య‌లో భ‌క్తులు తిరుమలకు త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల స‌మ‌యం ప‌డుతోంది. ఇక బుధ‌వారం శ్రీవారిని 59,140 మంది భక్తులు దర్శించుకోగా.. వీరిలో 16, 211 మంది తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News