ప్రసిద్ధిగాంచిన గార్ల శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధను సంక్రమణ ముహూర్తంలోనే పవిత్ర ధనుర్మాసవత్రం ఆరంభం అవటం, ‘మాసానాం మార్గశిరోహం మాసాల్లో మార్గశిర మాసాన్ని నేను’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించారని ఆయనను స్మరించుకుంటూ ధనుర్మాసాత్సోవాలను నిర్వహిస్తున్నట్లు అర్చకులు కాండూరి లక్ష్మీ నారాయణ చార్యులు పేర్కొన్నారు. గోదాదేవి శ్రీకృష్ణుడిని పొందటం కోసం ఈ మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ధనుర్మాస వ్రతం ఆచరించటం వల్ల ముక్తి మార్గం లభించాలని, సిరి సంపదలు కలగాలని, కన్యలకు కళ్యాణం కలగాలని ధూప దీపాలతో పూజలు నిర్వహిస్తారు.
అరుదుగా ఉండే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాల్లో గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. గార్ల గాంధీ పార్కు సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించేందుకు దేవాలయాన్ని నిర్మించగా నాటి ఆలయ పూజారి కలలో స్వామి వచ్చి విముఖత వ్యక్తం చేశారని, ఈ విషయాన్ని పూజారి స్థానిక ప్రముఖలకు తెలపటంతో ప్రతిష్ట నిలిపారట. దీంతో కొన్నేళ్ళ పాటు ఆలయం ఖాళీగా ఉండి పోయింది. ఇదే సమయంలో గార్ల మెయిన్ రోడ్డులో యాదవ కులానికి చెందిన భక్తురాలు బంకు మల్లమ్మ గృహ నిర్మాణానికి పూనుకోగా ఆ త్రవ్వకాల్లో సుందర దేవత విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని శ్రీలక్ష్మి నారాయణ స్వామి ఆళ్వారులుగా గుర్తించి పూజారి కాండూరి నర్సింహచార్యులు ఇంటి వద్ద ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించటం ఆరంభించారు. కొంతకాలం తర్వాత స్థానికులంతా సమావేశమై వెంకటేశ్వర స్వామి కోసం నిర్మించిన ఆలయంలో లక్ష్మీ నారాయణ స్వామి, గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఈ ప్రతిష్టాపనకు గ్రామ పుర ప్రముఖులు మాటేటి వరవరరావు నడుం బిగించారు. అనంతరం నర్సింహాచార్యులు గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరించి లక్ష్మీ నారాయణ స్వామి, భూదేవి, నీలాదేవి ఉత్సవ విగ్రహాలను తెప్పించి ప్రతిష్టించారు.
కొన్నేళ్ళ తర్వాత దేవాలయ బాగోగులు పట్టించుకోక పోవటంతో శిథిలావస్థకు చేరుకోగా దేవాలయాన్ని గార్ల వర్తక వ్యాపార ప్రముఖుడు పుల్లఖండం సత్యనారాయణ కృషితో ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మార్గశిర మాసంలో ధనుర్మాసోత్సవాలు, పూజా కార్యక్రమాలు చేస్తూ భోగి రోజున గోదా దేవి కళ్యాణం, చైత్ర శుద్ధ చతుర్దశి నాడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రావణ మాసంలోగోదాలక్ష్మీకి లక్ష కుంకుమార్చనలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ధనుర్మాసోత్సవ నిత్యనిధి కార్యక్రమాలతో పాటు ఈనెల 16న ధనుర్మాస ఆరంభమైతున్నాయి హనుమాన్ చాలీసా, 41 పర్యాయములు తీర్థప్రసాద వినియోగం, 27న గోదాదేవి అమ్మవారికి మహిళలచే సామూహిక లక్ష్మీ సహస్రనామ కుంకుమ పూజ కలశ పూజలు 1న ప్రత్యేక పూజలు 8న గోదాదేవి అమ్మవారికి దీపోత్సవం 10న ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనం, 10 తారీకు నుండి 12వ తారీకు వరకు అధ్యయనోత్సవం రాత్రి పరమపదోత్సవం 13వ తారీఖున గోదా రంగనాథుల కళ్యాణం 14వ తారీఖున మకర సంక్రాంతి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ వంశపరంపర్య అర్చకులు కాండూరిలక్ష్మీనారాయణచార్యులు తెలిపారు. ఇందుకై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.