Sawan Shivratri vs Mahashivratri: హిందూమతంలో శివుడిని పూజించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మహాదేవుడిని ఆరాధిస్తే మీ కోరిన కోర్కెలు తప్పక సిద్ధిస్తాయని భక్తులు విశ్వాసం. అలాంటి పర్వదినాలే శ్రావణ శివరాత్రి, మహాశివరాత్రి. చాలా మంది భక్తుల అభిప్రాయంలో ఇవి రెండూ ఒక్కటే అని నమ్ముతారు. మరికొందరు నెలవారీ శివరాత్రి, మహాశివరాత్రి ఒకే రోజు వస్తాయని విశ్వసిస్తారు. ఇవన్నీ శివుడికి అంకితం చేయబడినప్పటికీ తేడా ఉంది. అయితే ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మికపరంగా దేనీ ప్రత్యేకత దానిదే. వీటి మధ్య తేడాను ఇప్పుడు తెలుసుకుందాం.
మహాశివరాత్రి, శ్రావణ శివరాత్రికి తేడా ఇదే..
**మహాశివరాత్రి మరియు శ్రావణ శివరాత్రి రెండూ శివారాధనకు అంకితమైనవే. కానీ అవి సంభవించే రోజులు వేరు. మహాశివరాత్రిని ఏడాదికొకసారి జరుపుకుంటారు. సాధారణంగా దీనిని ఫాల్గుణ మాసంలో(ఫిబ్రవరి-మార్చి) జరుపుకుంటారు. అదే శ్రావణ శివరాత్రి పవిత్రమైన శ్రావణ మాసంలో అంటే జూలై–ఆగస్టు మధ్య వస్తుంది.
**పార్వతీపరమేశ్వరుల వివాహానికి గుర్తుగా మహాశివరాత్రి వేడుకను చేసుకుంటే.. శ్రావణ శివరాత్రిని భోలాశంకరుడి ఆశీస్సులు పొందడానికి జరుపుకుంటారు.
**ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి (14వ రోజు) నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు, అయితే శ్రావణ శివరాత్రిని శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి రోజున చేసుకుంటారు. ఈ రెండు రోజులు ఆధ్యాత్మికంగా, ఆరాధనపరంగా శక్తివంతంగా భావిస్తారు.
**హిందూ గ్రంథాల ప్రకారం, మహాశివరాత్రి నాడు శివుడు జ్యోతిర్లింగంగా అవతరించాడని నమ్ముతారు. మరోవైపు ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చే నెలవారీ శివరాత్రి పవిత్రమైన శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.
**పూజా విధానంలో కూడా ఈరెండు శివరాత్రులకు తేడా ఉంది. శ్రావణ శివరాత్రి నాడు శివుడిని మాత్రమే ఆరాధిస్తే.. మహాశివరాత్రి నాడు శివపార్వతులను కొలుస్తారు. శ్రావణ శివరాత్రి నాడు పూజ చేయడం వల్ల మహాదేవుడి ఆశీస్సులు, రక్షణ లభిస్తాయి. కానీ మహాశివరాత్రి నాడు ఇద్దరు దేవతలను ఆరాధించడం వల్ల వైవాహిక జీవితం బాగుంటుందని నమ్ముతారు.


