హోలీ పండుగ వచ్చిందంటే యువకులు, పిల్లలు, మహిళలు ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆడపడుచుల ఆటపాటలు, చిన్న పిల్లల జాజిరి ఆట పాటలతో గ్రామాలు మార్మోగుతుంటాయి. పండుగల్లో హోలీకి విశిష్టమైన స్థానం ఉంది. వసంత రుతువు ఆగమనానికి చిహ్నం ఈ పండుగ. ఈ రుతువులోనే చెట్ల ఆకులు రాలి కొత్త ఆకులు వస్తాయి. ప్రేమానురాగాలకు ప్రతీకగా, నూతన ఒరవడిని గుర్తు చేస్తూ వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ ఇది.
వైష్ణవములో రాక్షసరాజు హిరణ్యకశపుడు.. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చకపోవడంతో భక్త ప్రహ్లాదుడిని చంపాలని అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలిచి.. ఆమెకు ఉన్నశక్తితో భక్త ప్రహ్లాదుడిని మంటలతో ఆహుతి చేయమని కోరతాడు. దీంతో ఆమె భక్త ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో భక్త ప్రహ్లాదుడు బయటపడతాడు.. హోలిక రాక్షసి మాత్రం మంటల్లో చిక్కుకొని చనిపోతుంది. ఇక ఆమె దహనమైన రోజునే హోలీ పండుగగా పిలుస్తారని ప్రచారంలో ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో హోలిక దహనం చేస్తుంటారు.
రెండు రోజుల పాటు వేడుకలు
పట్టణ కేంద్రంలో పండితులు నిర్ణయించిన తేదీ ప్రకారం హోలీ పండుగ వేడుకలు రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రోజు ముందుగా, జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కామదాహనం, హోలీ పండుగకు ఒకరోజు ముందుగానే జరపడం గ్రామాల్లో ఆనవాయితీగా వస్తున్నది.
కనిపించని కోలల సందడి
కాముని పున్నమిని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోలలు(కర్రలు) పట్టుకొని తొమ్మిది రోజులపాటు చిన్నారుల బృందం నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల్లో ఊరంతా తిరుగుతూ పాడే పాటలు పల్లెలకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి ఇలా జాజిరి ఆడటం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం
రింగురింగు బిళ్లా..రూపాయి దండా
దండకాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగ నీడ నీడ కాదురో నిమ్మల బావి
బావి కాదురో బసంత కూర కూర కాదురో గుమ్మడి పండు
పండుకాదురో పాపర మీసంమీసం కాదురో మిరియాల పొడి
పొడి కాదురో పొరిమెల కట్ట కట్ట కాదురో చీపురు కట్ట
కట్ట తీసి నీ నెత్తిన కొట్టా.. ఇలాంటి ఎన్నో పాటలు పాడుతూ
విరాళాలను సేకరిస్తారు. వచ్చిన ఆ డబ్బులతో హోలీనాడు కావాల్సిన రంగులు తెచ్చుకొని సంబురాలు చేసుకుంటారు. మహిళలు ఇంటింటికీ తిరుగుతూ హోలీ పాటలు పాడుకుంటూ ఇనాం అడుగుతూ సందడి చేసేవారు.
జాజిరి పాటలు పాడుతూ ఇండ్ల ముందుకు వచ్చే చిన్నారులకు అమ్మలక్కలు తమకు తోచిన కానుకలు ఇచ్చి పంపిస్తారు. సాధారణంగా తమకు పండిన పంట ఉత్పత్తులతో పాటు డబ్బులు కానుకలుగా ఇస్తారు. ఇలా తొమ్మిది రాత్రులు ఆడుకొని చివరి రోజు కాముడిదహనం చేస్తారు. కోలాటానికి ఉపయోగించిన కర్రలను మంటల్లో కాల్చుతారు. మరుసటి రోజు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను సంబురంగా జరుపుకొంటారు. రంగుల్లో తడిసి ముద్దయ్యాక స్నేహితులంతా కలిసి ఊరి చివరన ఉన్న బావుల వద్దకు వెళ్లి ఈత కొడుతూ కేరింతలు కొడుతారు. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించడం లేదు.
కాముని పున్నమి
సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు.
రసాయనిక రంగులతో జాగ్రత్త అవసరం..
హోలీ రోజు రసాయనిక రంగుల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ రసాయనాల ప్రభావంతో చర్మ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇవి నేరుగా కండ్లలో పడితే కళ్లు ఎరుపె క్కడం, అంధత్వం బారిన పడే ప్రమాదం ఉంది. అస్తమా, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రసాయనాలు కలిపిన రంగులతో హోలీ ఆడితే శరీరంపై ఎక్కువ సేపు ఉండనీయకుండా చల్లని నీటితో సాధ్యమైనంత తొందరగా శుభ్రం చేసుకోవాలి. హోలీ ఆడడానికి ముందు ముఖానికి మాయిశ్చరైజ్, తలకు నూనె రాసుకోవడం ద్వారా రంగులు శరీరంలోకి ఇంకవు.
సహజ రంగుల వాడకమే ఉత్తమం
హోలీ పండుగ రోజు సహజ రంగులను వాడడం ఉత్తమం. చిన్నపిల్లలను రసాయనిక రంగులకు దూరంగా ఉంచాలి. సహజ సిద్ధమైన పర్యావరణ హితమైన రంగులు చల్లుకుంటే మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా దొరికే మోదుగు పూలను తెంపి నీళ్లలో వేసి ఉడికించి రంగును తయారు చేసి ఇవ్వాలి. ఈ రంగు నీళ్లు వాడడంతో శరీరానికి ఎంతో ఉపయోగకరంగా, ఆయుర్వేదంగా పని చేస్తాయి. వీటితో పాటు బుక్కా, గులాల్, పసుపును వాడితే బాగుంటుంది.