ఇల్లు అనేది కేవలం నివాస స్థలం మాత్రమే కాదు. మన జీవనశైలి, ఆరోగ్యం, శాంతి మరియు ధనసంపదకు ఆధారంగా మారే కేంద్రబిందువు అని పండితులు చెబుతుంటారు. ప్రతి ఇంటి మూల కోణంలో శక్తుల సమతుల్యత ఉండాలి. అందుకే వాస్తు శాస్త్రం ఇంటి శుభ్రతపై చాలా ప్రాధాన్యత ఇస్తోంది. శుభ్రత ఉన్న చోట శుభ శక్తులు చేరుతాయని, నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని నమ్మకం. వాస్తు నిపుణులు చెప్పిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం, బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజాము 4 నుంచి 6 గంటల మధ్యలో ఇంటిని ఊడ్చడం మంచిదికాదు. లక్ష్మీదేవి ఆ సమయాన ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం ఉంది. ఆ సమయంలో ఊడ్చడం వల్ల ఆమెకు అవమానం చేసినట్లవుతుందట. అలాగే సూర్యాస్తమయం తరువాత కూడా ఇంటిని ఊడ్చడం మంచిది కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరంగా ఊడ్చాల్సిన అవసరం వస్తే, ఇంటి చెత్తను వెంటనే బయటకు వేయకుండా… సూర్యోదయం తర్వాత మాత్రమే బయటపడేయమని సూచిస్తున్నారు.
ఇంటి గుమ్మం అనేది శుభ శక్తులకు ద్వారం. లక్ష్మీదేవి నివాసంగా భావించే గుమ్మంలో మురికి నీరు, శుభ్రం చేసే వస్తువులు వదిలిపెట్టడం శుభానికి ఆటంకం కలిగించడమే కాక, ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. శుభ్రత తరువాత ఉపయోగించిన నీటిని ఎల్లప్పుడూ ఇంటి గుమ్మం ముందు ఉంచకూడదు. అలాగే ఇంటి ముందబాగంలో వాటిని పారివేయకూడదంట.
ప్రస్తుత బిజీ జీవితాల్లో ఉదయాన్నే బయటకు వెళ్లాల్సిన సందర్భాలు ఉంటాయి. అటువంటి సమయంలో ఎవరికైనా ఇంటినుంచి వెళ్లిన వెంటనే ఇంటిని ఊడ్చితే, ఆ వ్యక్తి ఆరోగ్యానికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వాస్తు చెబుతోంది. కనీసం కొంత సమయం గ్యాప్ తీసుకుని మాత్రమే శుభ్రత పనులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. మహిళలు ఇల్లు శుభ్రం చేయడంలో పాత బట్టలు వాడటం చాలామంది సాధారణంగా చేసే పని. కానీ ఇది అశుభ ఫలితాలను కలిగించడంతో పాటు శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత దుస్తులు ధూళి, బ్యాక్టీరియాతో నిండిపోతూ ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి శుభ్రత పనులకు ప్రత్యేకమైన పరిశుభ్రమైన దుస్తులు వాడడం మంచిది.
ఇల్లు క్లీన్ చేయడం అంటే కేవలం చెత్త తొలగించడమే కాదు.. శుభాన్ని ఆహ్వానించడమే. చిన్నచిన్న నియమాలు పాటించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీతో నిండిన, ఆరోగ్యకరమైన జీవనం వైపు అడుగులేయవచ్చు. వాస్తు చెప్పే ఈ సూచనలు, మనం ఇంటిని శుభ్రం చేసే ప్రతి రోజు జీవితాన్నే శుభకరంగా మార్చవచ్చు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)