Saturday, July 27, 2024
HomeదైవంGarla: కన్నుల పండువగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం

Garla: కన్నుల పండువగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం

ఆహ్లాదకర వాతావరణంలో అమ్మవారి కల్యాణం

పచ్చని పొలాలు, పక్షుల కిలకిలా రావాలు, ఎత్తైన చెట్లు, సకల జనుల ఇంట కల్పవల్లి, భక్తుల మనసులో నిత్యం వెలుగొందే సిరిమల్లి, ఆహ్లాదకర వాతావరణంలోని మున్నేటి తీరాన వెలసి, ధర్మదేవతగా, వేదమాతగా, ప్రత్యక్ష దైవంగా భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం గార్ల మండల కేంద్రంలోని స్థానిక మున్నేటి ఒడ్డున గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయం ఆవరణంలో శనివారం రాత్రి భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరం మాగ శుద్ధ పౌర్ణమి నాడు లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వారి కళ్యాణ తిరునాళ్లు కీర్తిశేషులు శీలంశెట్టి దర్గయ్య పరంపరగా ఆ వంశస్తులు ఆలయ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తూ జరిపించడం ఆనవాయితీగా వస్తుంది.

- Advertisement -

తిరుపతమ్మ మాలధారణ స్వామి దీక్షాపరులు 40 రోజులపాటు పవిత్ర పుణ్య కార్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరుముడి జరిపి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శీలంశెట్టి రామభద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు తిరుపతమ్మ సమేత గోపయ్య స్వాముల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపైకి తీసుకువచ్చి పట్టు వస్త్రాలతో పూలమాలలతో అలంకరింపజేసి, పెళ్లి పీటలపై అదిష్టింపజేసి శీలంశెట్టి రామ భద్రయ్య సుభద్ర నవీన్ కీర్తి బొమ్మిడి గోపి మానస పుణ్య దంపతులు పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించి పీటలపై కూర్చొని పూజలు నిర్వహించగా మేళ తాళాలు భక్తజన జయజయ ద్వానాల నడుమ వేద పండితులు చల్లా శ్రీ రామశాస్త్రి మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తకంగా కళ్యాణ తంతును కన్నుల పండువగా నిర్వహించారు.

కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు గార్ల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి కళ్యాణ తంతును కనులారా తిలకించి, లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వార్లను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఈ కళ్యాణ తిరునాళ్లకు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శీలంశెట్టి రామభద్రయ్య మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కోరిన భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లే జగన్మాత శక్తి స్వరూపిణి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దివ్యదేవతగా 150 సంవత్సరాల క్రితం గార్ల మున్నేటి తీరాన స్వయంభుగా అవతరించిందని, భక్తులు కోరిన కోర్కెలు నెరవేరడంతో అమ్మవారికి అప్పటినుండి ధూప దీప పొంగళ్ల నైవేద్యాలతో పూజలు జరుపుకుంటూ భక్తులచే సేవలు అందుకుంటోంది.

ప్రతి సంవత్సరం మాగ శుద్ధ పౌర్ణమి నాడు తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వార్ల కు కళ్యాణ తిరునాళ్లు శోభాయ మానంగా జరిపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శీలంశెట్టి ప్రవీణ్ ఇమ్రాన్ కోటేష్ రాజేందర్ శ్రీనాథ్ వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు పుల్లయ్య శ్రీనివాస్ రమేష్ లక్ష్మీనరసయ్య నరేష్ సురేష్ బన్సిలాల్ కృష్ణా రెడ్డి పానుగంటి రాధాకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News