Ganesh Chaturthi 2025: పండుగలు ఆనందాన్నివ్వడంతోపాటు ప్రమాదాలను కూడా తెస్తాయి. ముఖ్యంగా గణపతి ఉత్సవాలు లాంటి బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునే పండుగలను నిర్వహించడం కత్తి మీద సామే. ఎందుకంటే రోజూ లక్షలాది మంది భక్తులు వినాయకుడిని దర్శించుకునేందుకు మండపానికి వస్తారు. ఈ క్రమంలో వారి భద్రత, విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచడం, కార్యక్రమం సజావుగా జరిగేలా చూడటం మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకుల బాధ్యత. అందుకే చాలా మంది తమ మండపాలకు భారీ స్థాయిలో బీమాను చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో బీమా కవరేజీ..
వినాయక చవితి దగ్గర పడుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో మండపాల ఏర్పాటు జోరందుకుంది. అయితే ముంబైలో మాత్రం వినాయకుడిని ఏర్పాటు చేసే మండపాల నిర్వహకులు భారీ బీమా కవరేజీని చేయిస్తున్నాయి. ఈ ఏడాది కింగ్స్ సర్కిల్‌లోని GSB సేవా మండల్ రికార్డ్ స్థాయిలో రూ. 474.4 కోట్ల బీమా పాలసీని కొనుగోలు చేసి వార్తల్లో నిలవడం విశేషం. ఇది గత సంవత్సరం రూ.400 కోట్ల పాలసీ కంటే చాలా ఎక్కువ. దేవతను అలంకరించే బంగారం మరియు వెండి ఆభరణాల విలువ పెరగడంతో పాటు, పాలసీ కింద ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులు మరియు పూజారులను చేర్చడం వల్ల ఈ పెరుగుదల సంభవించింది.
పాలసీ వేటిని కవర్ చేస్తుందో తెలుసా?
ఇది దేశంలోని ఏ వినాయక మండపం కూడా చేయించని అత్యధిక బీమా పాలసీ. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలో గల న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ అందిస్తోంది. ఈ పాలసీ బంగారం, వెండి మరియు విలువైన రాళ్ళు, వ్యక్తిగత ప్రమాద బీమా, అగ్ని మరియు భూకంప ప్రమాదాలు మరియు ప్రజా బాధ్యతను కూడా కవర్ చేస్తుంది. అయితే మొత్తం ఇన్సూరెన్స్ లో ఎక్కువ భాగం అంటే రూ. 375 కోట్లు వ్యక్తిగత ప్రమాద బీమాకు సంబంధించినదే. ఇది స్వచ్ఛంద సేవకులు, పూజారులు, వంటవారు, పరిచారకులు మరియు భద్రతా సిబ్బందికి కవరేజీని అందిస్తుంది. రూ.30 కోట్ల విలువైన ప్రజా బాధ్యత బీమా పండళ్లు, స్టేడియంలు మరియు భక్తులను కవర్ చేస్తుంది.
Also Read: Blood Moon 2025- బ్లడ్ మూన్ ఎప్పుడు? ఇది మన దేశంలో కనిపిస్తుందా?
ఈ సంవత్సరం పాలసీ బీమా ప్రీమియంలలో కూడా గణనీయమైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఆభరణాలకు సంబంధించిన ఆల్-రిస్క్ పాలసీ విలువ 2024లో రూ.43 కోట్లు మరియు 2023లో రూ.38 కోట్లుగా ఉండగా.. ఈ సారి రూ.67 కోట్లుగా ఉంది. బంగారం మరియు వెండి విలువ పెరుగుదలే దీని కారణమని GSB సేవా మండల్ అధ్యక్షుడు అమిత్ పాయ్ చెప్పారు. ఈ మండలం ఆగస్టు 27 నుండి 31 వరకు ఐదు రోజులపాటు గణేష్ ఉత్సవాలను నిర్వహించనుంది.
Also Read: Chandra Grahanam 2025- సెప్టెంబరు 07న చంద్రగ్రహణం.. ఈ 5 రాశులకు అదృష్టం..


