Karthika Pournami significance shiva vishnu deepotsavam diya lighting: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి రేపే (బుధవారం) జరుపుకోనున్నారు. ఈ కార్తీక మాసంలో దీపారాధన అత్యంత పవిత్రమైనది. దీపాలు వెలిగించడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అయితే, కార్తీక మాసంలో సాధారణంగా 365 వత్తుల దీపం వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా వెలిగించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే, కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు? దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఒకే దీపం వెలిగిస్తే.. ఏడాదంతా పుణ్యం
ఈ దీపారాధనలో ఉపయోగించే 365 వత్తులు సంవత్సరంలోని అన్ని రోజులను సూచిస్తుంది. పౌర్ణమి రోజున ఈ దీపం వెలిగించడం ద్వారా, భక్తులు ఏడాది పొడవునా ప్రతి రోజూ ఆలయానికి వెళ్లి దీపారాధన చేసినంత మహా పుణ్యాన్ని పొందుతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీనిని ‘సంవత్సర దీపం’ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రీత్యా ప్రతిరోజూ దీపం వెలిగించలేని వారికి ఇది చాలా అనుకూలమైన రోజు అని పండితులు సలహా ఇస్తున్నారు.
జ్ఞానానికి, శుభానికి ప్రతీక
దీపం కేవలం కాంతిని ఇవ్వడమే కాదు, అది జ్ఞానానికి, శుభానికి కూడా ప్రతీకగా భావిస్తారు. ఈ 365 వత్తుల దీపం వెలిగించడం ద్వారా భక్తుల జీవితంలోని అజ్ఞానపు చీకట్లు, కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని బలంగా విశ్వసిస్తారు. అంతేకాకుండా, కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి దీపారాధన తప్పకుండా చేయాలని చెబుతుంటారు. ఈ పవిత్ర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయని బలంగా నమ్ముతారు.
సకల దోషాల నివారణ
కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ దీపాన్ని పరమేశ్వరుడికి లేదా విష్ణుమూర్తికి అంకితం చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ దీపాన్ని భక్తులు అత్యంత శ్రద్ధతో, భక్తితో ఆలయాలలో లేదా పవిత్ర నదీ తీరాలలో వెలిగిస్తారు. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
దీపాన్ని ఇలా వెలిగించండి
కార్తీక దీపం వెలిగించడానికి 365 పత్తి వత్తులు ఉండేలా చూసుకోవాలి. వీటిని జాగ్రత్తగా లెక్కించి, వాటిని ఒక పెద్ద వత్తిలాగా సమూహంగా తయారుచేయాలి. ఈ వత్తిని పెద్ద మట్టి ప్రమిదలో లేదా 365 వత్తుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దీపం కుందులో ఉంచి, తగినంత నూనె (ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె) పోసి, పౌర్ణమి తిథి సమయంలో వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు శివకేశవుల నామాలను జపించడం, భక్తితో సంకల్పం చెప్పుకోవడం చేయాలి. ఈ విధంగా 365 వత్తుల దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


