మహాకుంభమేళాను పొడగిస్తున్నారా. చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇదే జరిగితే ఇంకా కోట్లాదిమంది కుంభ్ కు వెళ్లేందుకు గోల్డెన్ ఆపర్చునిటీ దొరికినట్టేనని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మహాకుంభ్ ను పొడగించాలని కోరుతున్నారు. గతంలో కుంభమేళా అయినా మహాకుంభమేళా అయినా కనీసం 75 రోజులపాటు సాగేదని ఈసారి మరీ తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ చెబుతున్నారు.
50 కోట్ల మంది
మహా కుంభమేళాలో ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించగా ఇంకా చాలామంది ఎక్కడికక్కడ చిక్కుకుపోగా మరికొంత మంది ప్రయాగ వెళ్లేందుకు భయపడుతున్నారని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చెబుతున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా ఔత్సాహికులకు వెళ్లే అవకాశం దక్కటం లేదని ఆయన వివరిస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరుగుతున్న మహా కుంభమేళా ఈసారి అత్యంత అరుదైనది కాగా 140 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన కుంభమేళా వస్తుందనే కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులంతా పోటెత్తారు. దీంతో కుంభ్ కు వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి.