Monday, November 25, 2024
HomeదైవంMahanandi: శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం

Mahanandi: శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం

ప్రతిష్ఠాత్మకంగా ఉత్సవాలు

మహానందీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేద్దామని నంద్యాల ఆర్డీవో మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. మహానందిలోని పోచా విశ్రాంతి భవనంలో మహాశివరాత్రి ఉత్సవాల రెండవ సమన్వయ కమిటీ సమావేశం ఆర్డిఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖ తరపున నిర్వహించే విధులను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలలో వివిధ షాపుల యజమానులు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు విక్రయించాలన్నారు. అధిక రేట్లు వసూలు చేయకుండా ఎంఆర్పి రేట్లకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధరల రేట్లు డిస్ప్లే చేసేటట్లు చూడాలన్నారు. ఆలయం ఆవరణలో పందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలకు సంబంధించి ఎవరికి కేటాయించిన విధులను వారు కచ్చితంగా నిర్వహించాలని సూచించారు.

- Advertisement -

ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవు..

ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుధ్యం లోపించి ఏదైనా సమస్యలు తలెత్తితే ఈఓఆర్డి, ఎంపీడీవో సంబంధిత పంచాయతీ కార్యదర్శిలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహా శివరాత్రికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. లాడ్జి యజమానులు అధిక బాడుగకు గదులను విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధిక ధరలకు గదులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 200 మంది పోలీస్ సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని వసతుల కల్పన, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండలకు భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షేమియాలు ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యాలు కల్పించడం, దాతలు సహకారంతో మజ్జిగ వితరణ చేస్తామన్నారు.

లడ్డూ ప్రసాదం..

భక్తులకు 1.20 లక్షల లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచుతామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహానందిలో మూడు రోజులపాటు మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు మధు, ఓ.వెంకటేశ్వర్లు, ఏవో శ్రీనివాస్ రెడ్డి, దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News