మహానంది పుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు వ్యాఘ్ర వాహనంపై కూష్మాండ దుర్గగా శ్రీ కామేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి,చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని,రుత్వికుల బృందం,అర్చక బృందం,నేటి ఉభయ దాతలచే యాగశాలలో రుద్ర హోమం చండీ హోమాలు, సామూహిక కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయంత్రం అలంకార మండపంలో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ, మహా మంగళహారతులు నిర్వహించారు. పూజల అనంతరం చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వ్యాఘ్ర వాహనంపై కూష్మాండ దుర్గగా శ్రీ కామేశ్వరి అమ్మవారిని ఆశీనులు గావించి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజలు అనంతరం కన్నుల పండుగగా గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దాతలు,దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.