శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాధి దేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలి నడకన శివస్వాములు, సాధారణ భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో నల్లమల అంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శివరాత్రి సమీపిస్తుండటంలో రాయలసీమ, కోస్తా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి మహిళలు, వృద్ధులు, చిన్నారులు మల్లన్న తండ్రి అదిగో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు.
నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఏర్పాట్లు ఫర్వాలేదని భక్తులంటున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే వెళ్తున్నాయి. శివస్వాముల భజనలతో ఈ అటవీ మార్గమంతా మార్మోగుతోంది. రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడంతో భక్తులకు నడక మార్గంలో కాస్త ఊరటనిచ్చే విషయం. భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు ఏర్పాటు చేశారు.
వెంకటాపురం నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుని వస్తున్న పాదయాత్ర భక్తుల కోసం పలువురు దాతలు మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.