హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ పుష్కరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో గండ దీపం వద్ద మొక్కులు అప్పగించుకున్నారు. స్వామి వారికి కోరుకున్న మొక్కులు తీరిన వారు కోడెను కట్టారు.
వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మకర సంక్రాంతి పర్వదినాన సోమవారం నాడు విశేషమైన ఉత్తరాన పుణ్య కాలంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృత నవరసాబిషేకము, బిల్వార్చన, క్షీరాభిషేకము, రుద్ర పారాయణ పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముల్కనూర్ ఏ కె.వి.ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవలందించారు. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు
కొత్తకొండ వీరభద్ర స్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ , హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, మాజీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, వొడిదల సతీష్ కుమార్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు వొడిదల ప్రణవ్, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయంలోకి మంగళ వాయిద్యాలతో లోనికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలను తీర్థ ప్రసాదాన్ని అందించి వేద పండితులు ఆశీర్వదించారు.
ప్రధాన ఆకర్షణగా కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు
కొత్తకొండ జాతరలో కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వరకు డప్పు చప్పులతో, ఆటపాటలతో కొత్తపల్లిలో సాయంత్రం ప్రారంభమైన ఎడ్లబండ్ల రథయాత్ర రాత్రి వరకు కొత్తకొండకు చేరుకున్నాయి. రథాలన్నీ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి.ఈ రథయాత్రను చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వచ్చారు.
రథయాత్రలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోరిన కోర్కెలు తీర్చే దేవుడు..
కొత్తకొండ వీరభద్ర స్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. వివాహం కావాలని, సంతానం కావాలని, ఆరోగ్యం గూర్చి, పంటలు సమృద్ధిగా పండాలని వీరభద్ర స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కారు. కోరిన కోరికలు తీరిన వారు వీరభద్ర స్వామికి కోర మీసాల సమర్పించారు.. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ.