రాష్ట్రవ్యాప్తంగా ‘రజా పర్బా’ వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఇంటా సరదాగా గడుపుతారు.వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూమాత భవిష్యత్ వ్యవసాయ కార్యకలాపాలకు తనను తాను సిద్ధం చేసుకుంటుందని (భూమాతకు రుతుస్రావం జరుగుతుందని) అక్కడి ప్రజలు నమ్ముతారు .
నేల సారవంతంగా మారి పంటలు వేయడానికి అనుకూలంగా మారుతుందని భావిస్తారు. అందుకే పిండి వంటలు, కాలానుగుణంగా లభించే పళ్లను నైవేద్యంగా పెట్టి భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. జూన్ రెండో వారం దాటిన తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి తొలకరి జల్లులు కురుస్తాయి అప్పటివరకు ఎండిన నేల తేమగా మారుతుంది. పంటలు వేయడానికి సిద్ధమవుతుంది.
ఈ పండగ మూడు రోజులు మహిళలు ఎలాంటి ఇంటి పనులు చేయరు. చేతులకు గోరింట, కాళ్లకు పారాణి పెట్టుకుంటారు. ఇంటింటా పిండి వంటకాలు, నూతన వస్త్రధారణ, గడసరి పిల్లల అల్లరి, కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు, అల్లుళ్ల సందడి, ఉయ్యాల జంపాల, కబడ్డీ ఆటలు, అమ్మాయిల షికార్లు, మిఠాపాన్‌ల మజా, బోటు షికార్లు, సినిమాలు, చిన్నారుల తుళ్లింతలతో రజా పండగ సందడిగా జరుగుతుంది భువనేశ్వర్లో రజా పర్బా వేడుకలను బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘బాలికలు, మహిళలు ఈ పండుగ సందర్భంగా చాలా సంతోషంగా గడుపుతారు. వారు మూడు రోజులు సెలవుల్లో ఉంటారు. ఈ పండుగ మా సంస్కృతి, సంప్రదాయంతో మమేకమై ఉంది. .. అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రఘుబర్ దాస్ , సీఎం మోహన్ చరణ మాఝి, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరం, అశ్వినీ వైష్ణవ్, మాజీ సీఎం నవీన్‌లతోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.