మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బైలు, పెచ్చేరువు, నాగులూటి గూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కె. శ్రీనివాసరావు, డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
తుమ్మలబైలు నుండి పెచ్చేరువుకు వెళ్ళే అటవీ మార్గంలో పెద్ద పులి పాద ముద్రలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు.
టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కింద
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు 46 కిలోమీటర్ల మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుందని ఈ మేరకు గుర్తించిన 12 ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, షేడ్, భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానంగా భక్తులు కాలినడకన ప్రయాణించే అటవీ మార్గమంతా కోర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ క్రిందకు వస్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రధానంగా నీటి అవసరం ఉంటుందని 2 లీటర్లు, 5 లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకువెళ్లేందుకు అటవీ సిబ్బంది అనుమతి ఇస్తున్నారని, తీసుకెళ్లిన పదార్థాలను ఎక్కడంటే అక్కడ పారేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామన్నారు. అటవీ మార్గంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారిని ఏ విధంగా బయటికి తీసుకువచ్చి వైద్యం అందించేందుకు అవసరమైన అంబులెన్సులు, ఇతర వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకునేలా వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
సంతృప్తిగా దర్శనం
శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు సోమవారమే మంత్రుల బృందం సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేసిందని కలెక్టర్ తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 నుండి 10 లక్షల మంది భక్తులు నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు వసతులు కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.