సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈనెల 29న తొలిఏకాదశి సందర్భంగా శ్రీమల్లికార్జునస్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మూడు రోజులపాటు ఈనెల 27 నుంచి 29 వరకు జప పారాయణలు జరిపించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 29వ తేదీన ఉదయం రుద్రహోమం దేవస్థానం అర్చకులు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రానున్న సుమారు 16 మంది ఋత్వికులు కూడా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సహస్ర ఘటాభిషేకం సందర్భంగా 29వ తేదీన ఆలయంలో జరిగే అన్నీ ఆర్జితసేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. సహస్ర ఘటాభిషేకం సందర్భంగా 28వ తేదీ రాత్రి దర్శనాలు ముగిసిన తరువాత శ్రీస్వామివారి గర్భాలయ ద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్మించి 29వ తేదీన ఉదయం 9 నుంచి 12 వరకు ఘటాభిషేకం జరిపిస్తారు. అలానే 29వ తేదీన సహస్ర ఘటాభిషేకం ప్రారంభమయ్యేంత వరకు అనగా ఉదయం 9 గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం మాత్రమే కల్పిస్తామని ఈవో లవన్న చెప్పారు.
సహస్ర ఘటాభిషేకం రోజంతా శ్రీస్వామివారు ఘటాభిషేకజలంలోనే ఉంటారు 30వ తేదీన వేకువ జామున మంగళ వాయిద్యాలకు ముందుగా ఘటాభిషేక జలాన్ని తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తామని, భక్తులందరు 29వ తేదీన ఆర్జిత సేవల నిలుపుదల విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలని ఈవో లవన్న తెలియజేసారు.