Padunettambadi Meaning:శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 మెట్లు విశేష ప్రాధాన్యమున్న పవిత్ర మార్గం. ఈ మెట్లను పదునెట్టాంబడి అని కూడా పిలుస్తుంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు 41 రోజుల దీక్ష తర్వాత ఇరుముడి తలపై ధరించి ఈ మెట్లు ఎక్కి స్వామివారిని కన్నులారా వీక్షిస్తారు. ఈ 18 మెట్లు భక్తుడి ఆత్మయాత్రలోని ప్రతి దశను సూచిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి.
ఈ సంఖ్య 18కి ఉన్న ప్రాధాన్యం ఎంతో లోతైనది. భక్తి, జ్ఞానం, ఆత్మశుద్ధి వంటి అంశాలతో ఈ సంఖ్యను అనుసంధానించారు. పురాణ కథల ప్రకారం, మణికంఠుడు అయ్యప్ప రూపంలో శబరిమలలో స్థిరపడే ముందు వేదాలు, శాస్త్రాలు, దిక్పాలకులు, జ్ఞానం, అవిద్య వంటి శక్తులను ఒక్కొక్క మెట్టుగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అందువల్ల ప్రతి మెట్టు ఒక దైవస్వరూపానికి ప్రతీకగా పండితులు చెబుతున్నారు.
ఆత్మనిగ్రహం, విలువలు, జ్ఞానం..
భక్తి మార్గంలో ఈ 18 మెట్లు ఆత్మనిగ్రహం, విలువలు, జ్ఞానం వంటి గుణాలకు ప్రతీకలుగా ఉన్నాయి. అయ్యప్ప స్వామి యోగమార్గాన్ని ఆచరించి చివరగా జ్యోతిరూపంలో అంతర్థానమయ్యారనే విశ్వాసం ఉంది. అందుకే మకర జ్యోతి దర్శనం అత్యంత పవిత్రంగా భావిస్తారు. అది అయ్యప్ప స్వామి స్వరూప దర్శనమే అని అనేక మంది నమ్ముతుంటారు.
అంతరంగ శక్తులను..
ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అవి అణిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత వంటి ఆధ్యాత్మిక శక్తులనుంచి మొదలై సర్వ సౌభాగ్యదాయక వరకు విస్తరిస్తాయి. ఇవి భక్తుడు జీవితంలో సాధించాల్సిన అంతరంగ శక్తులను సూచిస్తాయి. ఒకో మెట్టుపై అడుగు వేస్తూ ఆత్మజ్ఞానంలో ఉన్నత స్థానాన్ని పొందడం అనే భావన ఉంది.
18 మెట్లు 18 దేవతా శక్తుల ప్రతీకలు..
అదే విధంగా ఈ 18 మెట్లు 18 దేవతా శక్తుల ప్రతీకలుగా కూడా చెప్పబడతాయి. మహాకాళి నుండి అన్నపూర్ణేశ్వరి వరకు ప్రతి దేవతా శక్తి ఒక మెట్టుకు అనుసంధానమై ఉందని పూర్వగ్రంథాలు పేర్కొంటాయి. ఈ విధంగా భక్తుడు మెట్లు అధిరోహించడం ద్వారా ఆ దైవశక్తుల క్షేమాన్ని పొందుతాడనే నమ్మకం ఉంది.
లోభం, క్రోధం, మోహం
అయ్యప్ప స్వామి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన వద్ద ఉన్న ఆయుధాలను విడిచిపెట్టినట్లు పురాణ వర్ణనలు చెబుతాయి. వీటిలో శరం, క్షురిక, డమరుకం, సుదర్శనం, త్రిశూలం వంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు ప్రతి దైవశక్తికి ప్రతీకగా పరిగణిస్తారు. భక్తి మార్గంలో ఈ అస్త్రాలను విడిచిపెట్టడం అనేది లోభం, క్రోధం, మోహం వంటి మనసులోని దుర్గుణాలను విడిచి పావిత్ర్యాన్ని పొందడాన్ని సూచిస్తుంది.
పంచేంద్రియాలను..
మొదటి ఐదు మెట్లు మన పంచేంద్రియాలను సూచిస్తాయని భావిస్తారు. అంటే భక్తుడు కళ్ళతో మంచి చూడాలి, చెవులతో మంచిని వినాలి, వాక్కుతో మంచిని మాట్లాడాలి అని ఆత్మనిగ్రహాన్ని గుర్తు చేస్తాయి. ఆ తర్వాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దర్పం వంటి నెగటివ్ భావనలను దూరం చేయాలని సూచిస్తాయి.
సత్వం, రజస్యం, తామసం..
తదుపరి మూడు మెట్లు సత్వం, రజస్యం, తామసం అనే మూడు గుణాలను సూచిస్తాయి. వీటిలో సమతౌల్యాన్ని పొందడం ఆధ్యాత్మిక ఎదుగుదలకూ అవసరమని భావిస్తారు. చివరి రెండు మెట్లు విద్య, అవిద్యలకు సూచికలు. జ్ఞానం పొందాలంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలని ఇవి మనకు బోధిస్తాయి.
ఈ 18 మెట్లు భౌతికంగా మాత్రమే కాక ఆత్మీయంగా కూడా 18 కొండలను సూచిస్తాయి. పొన్నాంబళమేడు నుండి శబరిమల వరకు ఉన్న ఈ 18 కొండలు భక్తుడి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలు, శుద్ధి ప్రక్రియలకు ప్రతీకలుగా భావిస్తారు. ప్రతి కొండ దాటినప్పుడు భక్తుడు తనలోని ఒక లోపాన్ని విడిచి మరింత శుద్ధతను పొందుతాడు.
శరీరం, మనసు, ఆత్మలను…
ఇరుముడి తలపై పెట్టుకొని ఈ మెట్లు అధిరోహించడం అనేది భక్తుడి జీవితానికి ఒక ప్రతీక. అది శరీరం, మనసు, ఆత్మలను నియంత్రిస్తూ దైవస్వరూపాన్ని పొందే మార్గం. అయ్యప్ప స్వామి దర్శనం అంటే కేవలం ఆలయంలోని విగ్రహం చూడటం కాదు, ఆ 18 మెట్లలోని ప్రతి పాఠాన్ని గ్రహించి మనసును శుద్ధి చేసుకోవడం.


