పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి హంస వాహనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు హంస వాహనంపై మాడవీధుల్లో దర్శనమిచ్చారు. స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువ జామున మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి మూలవిరాట్ కు, ఉత్సవ మూర్తులకు, అర్చనలు, మంగళ హారతులను అర్చకులు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై అందంగా అలంకరించి ఉత్సవ మూర్తులను వైభవంగా ఊరేగించారు. హంస అంటే జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. హంసలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే.. నీళ్లను, పాలను వేరుచేసే స్వభావంతో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి ప్రసాదించేందుకు స్వామి వారు హంస వాహనంపై కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్ కుమార్, అర్చకులు ద్వారాకనాథ్, బాలాజీ స్వామి, గుండురావు, ఉత్సవదాతలు, భక్తులు పాల్గొన్నారు.