ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉత్సవాన్ని మంగళవారం జిల్లా యంత్రాంగం ప్రశాంతంగా నిర్వహించింది. ఎప్పటిలాగే పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా, శ్రీ పైడితల్లి అమ్మవారు మూడుసార్లు విజయనగరం పురవీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి, భక్తులకు దర్శనమిచ్చారు. తన పుట్టినిల్లు విజయనగరం కోటవద్దకు వెళ్లి, రాజ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలకు అనుగుణంగా, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మార్గదర్శకత్వంలో వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో, కలిసికట్టుగా కృషి చేసి, ఉత్సవాలను విజయవంతం చేశాయి.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది అమ్మవారి సిరిమానొత్సవాన్ని సకాలంలో పూర్తి చేశారు. మంత్రి బొత్స ఆధ్వర్యంలో మొదట్లోనే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పురప్రముఖులతో సమవేశాన్ని నిర్వహించి, ఉత్సవాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా అమ్మవారి సిరిమాను పండుగను నిర్వహించారు.
ఉత్సవానికి అమ్మవారి సిరిమానును, ఇతర రథాలను ముందుగానే ఆలయం వద్దకు తీసుకురావడంతో, సాయంత్రం 4.37 నిమిషాలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమయ్యింది. తోపులాటలు జరగకుండా, ఉత్సవానికి అంతరాయం కలుగకుండా పటిష్టమైన బారికేడ్లను ఆర్అండ్‌బి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, పలు చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. త్రాగునీటి సదుపాయం కల్పించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా త్రాగునీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు , జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రథాన్ని సిద్ధం చేసి సిరిమానోత్సవం త్వరగా ప్రారంభించేందుకు కృషి చేయడమే కాకుండా ముందుండి సిరిమాను నడిపించారు. ఉత్సవం పూర్తి అయ్యేవరకు పర్యవేక్షించారు.
కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా, ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, పైడితల్లి ఆలయ ఈఓ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ ఆర్. శ్రీరాముల నాయుడు, ఇతర అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఆర్అండ్‌బి, పైడిమాంబ దేవస్థానం, వైద్యారోగ్యశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాన్స్‌కో తదితర సుమారు 25 ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది సమన్వయంతో కృషి చేసి, ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. వీరిని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. సిరిమానోత్సవం, విజయనగరం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ అందించిన సేవలు ప్రశంసలను అందుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ఉత్సవాన్ని ప్రశాంతంగా పూర్తిచేయడంలో పోలీసులు కీలక పాత్ర వహించారు. అత్యంత ఘనంగా జరిగిన అమ్మవారి సిరిమానోత్సవం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
సిరిమానోత్సవాన్ని తిలకించిన ప్రముఖులు
కన్నులకింపైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్నిపలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా తిలకించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆశీనులై ఉత్సవాన్ని తిలకించింది. ఆయనతోపాటుగా రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సి డాక్టర్ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, కంబాల జోగులు ఇతర ప్రముఖులు, అధికారులు సైతం ఇక్కడినుంచే ఉత్సవాన్ని తిలకించారు.
మాన్సాస్ ఛైర్‌పర్సన్, పైడితల్లి ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, వారి కుటుంబ సభ్యులు కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించి పరవశించారు.