Dasara Festival 2025 Date: హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దసరా ఒకటి. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ పండుగను సుమారు పది రోజులు జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం 11 రోజుల జరుపనున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా లేదా విజయదశమిని జరుపుకుంటారు. శరదృతువు ఆరంభంలో వస్తుంది కాబట్టి ఈ పండుగను శరన్నవరాత్రి అంటారు.
పురాణాల ప్రకారం, ఆశ్వయుజ మాసం దశమి రోజున శ్రీరాముడు రావణుడుపై విజయం సాధించాడని నమ్ముతారు. అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా కూడా భావిస్తారు. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని సంహరిస్తుంది. ఆ రాక్షసుడి పీడ విరగడయిందని ప్రజలు సంతోషంతో పదో రోజున పండుగ జరుపుకుంటారు, అదే విజయ దశమి.
దేశవ్యాప్తంగా దసరా సంబురాలు..
దసరా పండుగను మన తెలుగు రాష్ట్రాలతోపాటు మైసూర్, కలకత్తా, ఒడిశా వంటి ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలో అయితే దసరా సమయంలోనే బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులపాటు జరుపుతారు. దీనినే గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ అంటారు. ఈ దసరా వేడుకలు ఏపీలోని విజయవాడలో అయితే కన్నులపండువగా జరుగుతాయి. విజయదశమి నాడు కృష్ణానదిలో తెప్పోత్సవం ఏర్పాటు చేసి.. అందులో అమ్మవారిని ఊరేగిస్తారు. దసరా చివరి రోజు జరిగే ప్రభల్లో భేతాళ నృత్య ప్రదర్శన ఇక్కడి ప్రత్యేకత. ఈ పండుగ సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏనుగుల సంబరం, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం, కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో రాళ్లయుద్ధం, ఒంగోలు కళారాలు ఊరేగింపు , బందరులో శక్తిపటాలు ఊరేగింపు జరుపుతారు.
ఈ ఏడాది దసరా ఎప్పుడు?
దసరా పండుగను ఈ సంవత్సరం అక్టోబరు 2వ తేదీన జరుపుకోనున్నారు. ఈ ఫెస్టివల్ ను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ 11 రోజులపాటు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. నవరాత్రి తొమ్మిది రోజుల్లో తొలి మూడు రోజులు పార్వతీ లేదా దుర్గామాతను, తర్వాత మూడు రోజుల లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతిదేవిని పూజిస్తారు.
Also Read: Vijayawada- సెప్టెంబర్ 22 నుంచే దసరా ఉత్సవాలు… ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం..
విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలు ఇలా..
సెప్టెంబరు 22- శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారం
సెప్టెంబరు 23- శ్రీ గాయత్రి దేవి అలంకారం
సెప్టెంబరు 24- శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం
సెప్టెంబరు 25- శ్రీ కాత్యాయిని దేవి అలంకారం
సెప్టెంబరు 26- శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం
సెప్టెంబరు 27- శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
సెప్టెంబరు 28- శ్రీమహా చండీ దేవి అలంకారం
సెప్టెంబరు 29- శ్రీ సరస్వతి దేవి అలంకారం
సెప్టెంబరు 30- శ్రీ దుర్గా దేవి అలంకారం
అక్టోబరు 01- శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
అక్టోబర్ 02- శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
Also Read: Aja Ekadashi 2025 – అజ ఏకాదశి ఆగస్టు 18నా లేదా 19నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..


