Vaikuntha Chaturdashi 2025 Date and Significance: హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశిని జరుపుకుంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువును పూజించిన వారు మరణానంతరం వైకుంఠ చేరుకుంటారని భక్తుల నమ్మకం. ఈ పండుగ నాడు శివుడిని కూడా ఆరాధిస్తారు. శివకేశవులను ప్రార్థించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి ఉండటంతోపాటు మోక్షం కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం ఈ పవిత్రమైన వైకుంఠ చతుర్దశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
తేదీ, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, వైకుంఠ చతుర్దశి నిషిత కాలం నవంబర్ 04 రాత్రి 11:39 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 05 అర్ధరాత్రి 12:31 గంటల వరకు ఉంటుంది. అంటే పూజా సమయం 52 నిమిషాలపాటు ఉంటుంది. కార్తీక చతుర్దశి తిథి నవంబర్ 04 తెల్లవారుజామున 02:05 గంటలకు ప్రారంభమై.. అదే రోజు రాత్రి 10:36 గంటలకు ముగుస్తుంది. దీంతో వైకుంఠ చతుర్దశిని నవంబర్ 4, మంగళవారం నాడు జరుపుకోనున్నారు.
పురాణ కథనం
శివ పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు ఒకనాడు కార్తీక చతుర్దశి నాడు శివుడిని పూజించడానికి వారణాసికి వచ్చాడు ఆయన మహాదేవుడికి వెయ్యి కమల పువ్వులను సమర్పించాడు. ఇంతలో ఒక పువ్వు కనిపించకుండా పోయింది. దీంతో కమలనయనుడైన శ్రీహరి తన కంటిలో ఒకదాన్ని పరమేశ్వరుడుకు సమర్పించాడు. విష్ణువు భక్తిని మెచ్చిన శివుడు అతడికి తన కన్నును పునరుద్ధరించాడు. అంతేకాకుండా రక్షణ మరియు ధర్మానికి ప్రతీకగా నిలిచే సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు.
Also Read: Rare Rajyog -14 ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగం.. ఈ 3 రాశులకు అఖండ ధనయోగం..
అక్కడ ఘనంగా..
ఈ పవిత్రమైన రోజున, నిషిత కాల (అర్ధరాత్రి) సమయంలో విష్ణువును, తెల్లవారుజామున శివుడిని పూజిస్తారు. విష్ణు భక్తులు విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ.. పూజలో వెయ్యి కమలాలను సమర్పిస్తారు. ఇదే సమయంలో శివభక్తులు పవిత్రమైన నదీ స్నానం చేస్తారు. ఇది వారి ఆత్మను శుద్ది చేయడంతోపాటు ఆ దేవుడు కటాక్షం ఉంటుంది. వైకుంఠ చతుర్దశి పండుగను వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలోవైభవంగా జరుపుకుంటారు. ఇక్కడి గర్బగుడిలో శివుడి పక్కన విష్ణువుకు స్థానం లభించింది. ఈ శుభ దినాన విష్ణువు తులసి ఆకులను శివుడికి అర్పిస్తే..ప్రతిగా మహాదేవుడు శ్రీహరికి బిల్వపత్రాలను సమర్పిస్తాడు. ఇది పరస్పర గౌరవం మరియు దైవిక సామరస్యాన్ని సూచిస్తుంది.


