శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర పాల్గున శుద్ధ పాండ్యమి మంగళవారం తేదీ 21/02/23 నుండి శుద్ధ ఏకాదశి శుక్రవారం 03/03/23
వరకు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యరాధనల అనంతరం శ్రీ విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనం రక్షాబంధన కార్యక్రమములు పాంచరాత్ర ఆగమ శాస్త్రాను సారముగా యజ్ఞచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్ల దింగల్ లక్ష్మినర సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు అర్చక బృందం పారాయనీకులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ బి. నరసింహమూర్తి , ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ గీత, ఆలయ అధికారులు పాల్గొన్నారు
శ్రీ విశ్వక్సేన ఆరాధన ప్రత్యేకత
బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ స్వామివారి ఆలయంలో ఉత్సవములు నిర్విఘ్నముగా కొనసాగాలని లోకములకు శుభములు కలగాలని వేదమంత్రములు పాటిస్తూ శ్రీ పాంచా రాత్రాగమ శాస్త్రానుసారముగా శ్రీ విశ్వక్సేన ఆరాధన గావించారు. ఈ వేడుక ద్వారా భగవదనుగ్రహముతో విశ్వశాంతి లోక కళ్యాణం కలుగుతుంది.
స్వస్తి వాచనము ప్రత్యేకత
స్వస్తి అనగా శుభమని అర్థము లోకమంతా సుభిక్షంగా ఆయురారోగ్యములతో ఉండాలని స్వస్తివాచన. మంత్రములతో భగవంతుని వేడుకొనుటయే స్వస్తివాచనము భగవంతుని అర్పించుటకు మనకు యోగ్యత కలగాలని, దేశ కాల ప్రాంత శుద్ధి జరగాలని ఈ వేడుక నిర్వహించుట విశేషం .
రక్షాబంధనం ప్రత్యేకత
బ్రహ్మోత్సవాలలో రక్షాబంధనం వేడుక ఎంతో విశేషమైనది ఉత్సవమూర్తులతో పాటు మూలవరులకు శ్రీ పాంచరాత్రగమ శాస్త్రానుసారంగా రక్షాబంధన వేడుక నిర్వహిస్తారు రక్షాబంధనములు తండుల పాత్రల యందు ఉంచి విమల మొదలగు అష్టదళ శక్తి దేవతలను ఆవాహన చేసి మంత్రములతో ధూప దీపములు సమర్పించి శ్రీ స్వామివారికి అమ్మవారికి కంకణ ధారణ చేస్తారు అనంతరం నిర్వాహక బృందం భక్తులు ఈ రక్ష కంకణములను ధరించి ఉత్సావాంతము దీక్షాపరులై శ్రీ స్వామివారి సేవలో పాల్గొనుట ప్రత్యేకత.
సాయంకాల కార్యక్రమములు
మంగళవారం రోజు సాయంకాలము నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా సాయంత్రం 6:30 ని లకు మృత్య గ్రహణము, అంకురార్పణ కార్యక్రమములను యజ్ఞాచార్యులు ప్రధాన అర్చకులు అర్చక బృందం పారాయణనీకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రనుసారముగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు ఉద్యోగ సిబ్బంది భక్తులు పాల్గొంటారు .
మృత్సం గ్రహణము, అంకురారోపణ ప్రత్యేకత
శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మృత్సం గ్రహణం అంకురారోపణ వేడుక నిర్వహిస్తారు. భూసూక్తముతో భూదేవిని అర్పించి మృత్తికను సేకరించి పాలికలలో నింపుతారు. అంకురారోపణ మంత్రములతో నవ ధాన్యములను మంత్రించి పాలికలలో నింపి పవిత్ర జలములతో ఉత్సవాంతము వరకు ప్రతిరోజు ఆరాధిస్తారు లోకమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని భగవానుని వేడుకొనుటే ఈ వేడుకలోని ప్రత్యేకత.