Monday, June 24, 2024
Homeఓపన్ పేజ్What is rave party?: రేవ్ పార్టీ అంటే?

What is rave party?: రేవ్ పార్టీ అంటే?

టూరిస్టు ప్లేసుల్లో పెరుగుతన్న రేవ్ కల్చర్

వందల సంవత్సరాలకు పూర్వం పాశ్చాత్య దేశాలలో పార్టీలంటే లింగ బేధం లేకుండా అలవాటున్న వారందరూ ఒకచోట చేరి కేవలం మద్యం సేవించడం. కాలక్రమంలో ఈ పార్టీలు మార్పు చెందుతూ మద్యం సేవించడంతో పాటు డ్యాన్స్ చేసే పార్టీలుగా రూపుదిద్దుకున్నాయి. 1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ డాన్స్ పార్టీలలో మద్యంతో పాటు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా, యాంఫేటమిన్, ఎల్ఎస్డీ, కెటామైన్, మెథాంఫేటమిన్ , కొకైన్ , గంజాయి వంటి మాదకద్రవ్యాలు రహస్యంగా వినిగించడం ప్రారంభమై రేవ్ పార్టీల విష సంస్కృతి ప్రపంచానికి పరిచయమైంది.

- Advertisement -

భారతదేశంలో రేవ్ పార్టీల వ్యాప్తి

భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పాశ్చాత్య దేశాల రేవ్ పార్టీల సంస్కృతి మనదేశంలో కూడా వ్యాప్తి చెందుతుంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది. ఇలా అక్కడున్న కొన్ని కల్చర్ల రుచికి అలవాటు పడిన సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు అదే ట్రెండ్ ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మన దేశానికి వచ్చిందే ఈ రేవ్ పార్టీ. భారతదేశంలో రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.

రేవ్ పార్టీలు జరుపుకునే విధానం

కాస్త వైల్డ్ బిహేవియర్తో చేసుకునే ఈ రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ ను కూడా తీసుకుంటూ చీకటిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ను ప్లే చేస్తుంటే ఒళ్ళు మరిచి వివేకం కోల్పోయి వావి వరసలు లేకుండా డాన్సులు చేస్తుంటారు. యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ రేవ్ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఈ రేవ్ పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా మారుతుంది.

రేవ్ పార్టీ సుదీర్ఘంగా సాగే పార్టీ. ఈ పార్టీలో పాల్గొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రేవ్ పార్టీలు 24 గంటల నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారు. ఒకప్పటి రాక్ ‘ఎన్ రోల్ యుగం, హిప్పీ యుగం, డిస్కో మరియు ర్యాప్ లాగా ఇప్పుడు ఈ రేవ్ యుగం. అయితే వీటన్నిటికంటే ఈ ” రేవ్” ది ఏ హద్దులు లేని విచ్చలవిడి సంస్కృతి. ఈ రేవ్ పార్టీలో పాల్గొనాలంటే మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, విచ్చలవిడిగా వ్యభిచారం చేయడం మరియు అవసరానికి మించిన ధనం కలిగి ఉండటం లాంటి అవలక్షణాలు ఉండాలి. అందుకే ఈ రేవ్ పార్టీలకు ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. గోప్యతపై పూర్తి శ్రద్ధ వహిస్తారు.

రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తుల భావజాలం

“రేవ్” అంటే మంచైనా చెడైనా హద్దు లేకుండా ప్రవర్తించడమే. హద్దులు, జాత్యహంకారం, పక్షపాతం, లింగభేదం, నియమాలు, తుపాకీలు మరియు ద్వేషం ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం శాంతి, ప్రేమ, ఐక్యత మరియు గౌరవంతో నిండిన ప్రపంచం లోకి తీసుకెళ్లడమే “రేవ్” సంస్కృతని సమర్థించుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. నిజమే డ్రగ్స్ కు బానిసలైన మనుషులకు ఇవేవీ ఆలోచించే స్పృహ ఉండదు కదా. దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువత వేరే ప్రపంచమని సమర్థించుకుంటూ మత్తు పదార్థాలకు బానిసలైతే భావి తరాల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి.

రేవ్ పంజా – కూకటివేళ్లతో పెకలించాలి

పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిన వావివరుసలు లేని ఈ రేవ్ పార్టీల విష సంస్కృతికి ఎక్కువగా తల్లిదండ్రుల సంరక్షణ సరిగా లేని ధనవంతుల పిల్లలు, సినీ రాజకీయ రంగాల ప్రముఖులు అలవాటు పడుతున్నారు.మనుషులలోని వివేకాన్ని మాయం చేసి జంతువుల సంస్కృతిలోకి తీసుకువెళ్లే ఒక వాతావరణాన్ని సృష్టించేదే ఈ రేవ్ పార్టీ. ఇటువంటి విష సంస్కృతి వ్యాప్తి చెందడం సమాజానికి మంచి సంకేతం కాదు. “రేవ్” విచ్చలవిడి సంస్కృతి సమాజంపై పంజా విసరకముందే దానిని కూకటివేళ్ళతో పెకలించి వెయ్యాలి.

ననుబోలు రాజశేఖర్,
హెచ్.ఓ.డి & అసోసియేట్ ప్రొఫెసర్,
ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్,
శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల,
తాడేపల్లిగూడెం,
పశ్చిమగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఫోన్ నెంబర్స్: 9885739808,8330969808

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News